AP Rain Alert: వరుణుడు తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీకి మరో పిడుగు లాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. దీంతో అలెర్ట్ అయ్యారు అధికారులు. కొద్ది రోజులుగా రాయలసీమ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి భారీ వర్షాలు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు సీమ ప్రజలు. అటు ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వరికోతలు మొదలు పెట్టారు రైతులు. ఈ నేపథ్యంలో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ స్థాయి ట్రోపోస్పేయర్ వరకు వ్యాపించి ఉన్నట్టు తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత తీవ్రమై తుఫానుగా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వివరించింది వాతావరణ శాఖ.
ఆ తరువాత వాయువ్యదిశగా కదిలి మరింత బలపడి డిసెంబరు 4వ తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది వాతావరణశాఖ. డిసెంబరు 3, 5 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో.. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు పంటలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఆఫీసర్లు.
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..