Andhra Pradesh: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాన గండం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..
బంగాళాఖాతంలో కల్లోలం మొదలైంది. ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం రాబోయే గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుండటంతో ఉత్తర కోస్తా తీరం వణికిపోతోంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులు, కుండపోత వర్షాలతో విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. పశ్చిమ-మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గడిచిన కొద్ది గంటలుగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్లు, అలాగే ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 12 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం వెల్లడించింది.
తీరం దాటేది ఇక్కడే..
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈ తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కోస్తాంధ్ర మీదుగా వాయుగుండం ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోయి, విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
కోస్తాంధ్ర, యానాంలో వాతావరణ పరిస్థితి ఇదీ..
కోస్తాంధ్ర, యానాం పరిధిలో ఈ తీవ్ర వాయుగుండం తీవ్ర ప్రభావం చూపనుంది. మంగళ, బుధవారాల్లో కోస్తాలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయి. తీరం వెంబడి గంటకు 40 నుండి మొదలై క్రమంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు పెరిగే పెను ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనే సూచనలు ఉన్నాయి.
రాయలసీమలో జోరు వానలు
మంగళవారం రాయలసీమ వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే వీలుంది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతూ, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ తర్వాత ఎల్లుండి నుంచి రాయలసీమలో వర్ష తీవ్రత క్రమంగా తగ్గి, ఒకటిరెండు చోట్ల తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
తీవ్ర వాయుగుండం దూసుకొస్తున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల సమీపంలో గానీ ఉండకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక బృందాలను రంగంలోకి దించారు.
