Sachivalayam Employees: ”సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే ఆ పరీక్ష పాసవ్వాల్సిందే”
Sachivalayam Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే.. తప్పనిసరిగా డిపార్ట్‌మెంట్ పరీక్ష పాస్ కావల్సిందేనని ఏపీ ప్రభుత్వ..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే.. తప్పనిసరిగా డిపార్ట్‌మెంట్ పరీక్ష పాస్ కావల్సిందేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మొదటి నుంచి ఐఏఎస్‌లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులకూ ఈ విధానమే అమలు చేస్తున్నామన్నారు. ఈ పరీక్షలో పాస్ కాకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన వారిలో ఎవరి ఉద్యోగాలూ పోవని ఆయన హామీ ఇచ్చారు.
ప్రొబేషన్ పీరియడ్ నుంచి పర్మినెంట్ చేసేందుకు.. పే స్కేల్ నిర్ణయించేందుకు కోసం ఈ పరీక్షను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. పరీక్షలో పాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారు. ఇక పరీక్షలో పాసైన ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్టు తప్ప మరో పరీక్ష ఉండదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ ఒక్కరి ఉద్యోగం పోదు.. ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
అటు క్రెడిట్ బేస్ అసెస్‌మెంట్ పరీక్షను సెప్టెంబర్ 11-17 మధ్య ఒక రోజున నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రాధమిక నిర్ణయానికి వచ్చింది. 100 ప్రశ్నలకు 90 నిమిషాల పాటు పరీక్షను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ పరీక్షకు శాఖలవారీగా సిలబస్‌ను సిద్దం చేయనుండగా.. ప్రశ్నాపత్రం తయారీ, ఫలితాల వెల్లడి, ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించినట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.