ఏపీలో పిడుగుపాటుకు ఆరుగురు మృతి.. మరో 3 రోజులపాటు వర్షాలు

|

Apr 24, 2023 | 9:59 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో 10.1 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చినపవనిలో 9.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల 3 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం..

ఏపీలో పిడుగుపాటుకు ఆరుగురు మృతి.. మరో 3 రోజులపాటు వర్షాలు
Lightning kills 6 in AP
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో 10.1 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చినపవనిలో 9.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల 3 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని , మరికొన్ని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదివారం కురిసిన వాన దాటికి పిడుగులు పడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు మరణించారు.

పంటకోసం పోయి..

కృష్ణాజిల్లాలో పిడుగులు పడి వేరువేరు చోట్ల నలుగురు మరణించారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మొక్కజొన్న పంట తడవకుండా పట్టాలు కప్పుతుండగా సమీపంలో పిడుగుపడటంతో మత్తి వెంకటరామయ్య (53) అక్కడికక్కడే మృతి చెందాడు. కృత్తివెన్ను మండలం సంగమూడిలో కూనసాని వెంకటేశ్వర రావు(55) పొలంలో పశువులు మేపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. చల్లపల్లి మండలం రామానగరం క్లబ్‌రోడ్‌లో కె నాంచారమ్మ (90), కమలా థియేటర్‌ దగ్గర సైకిల్‌షాపు మస్తాన్‌ పిడుగుపాటు శబ్దానికి గుండె ఆగి మరణించారు. మరికొన్ని చోట్ల పిడుగులు పడి నాలుగు వరికుప్పలు దగ్ధంకాగా, రెండు పాడిగేదెలు మృత్యువాతపడ్డాయి.

కళ్లాల్లో ఆరబోసిన మిరపకాయలపై పట్టలు కప్పుతుండగా..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. 50ఏళ్ల వయసున్న చాట్ల శ్యాంబాబు, 55 ఏళ్ల కొరివి కృపానందం చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. అకాల వర్షం రావడం వల్ల కళ్లాల్లో ఆరబోసిన మిరపకాయలపై తార్బాల్‌ పట్టలు కప్పుతుండగా పిడుగు పడింది.. పిడుగు పాటుకు వీళ్లిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు.. ఇద్దరినీ హుటాహుటీన ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆ ఇద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మృతదేహాలను గుంటూరు జి జి హెచ్ కి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.