ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 12: చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని.. ఆయన రక్షణ రాష్ట్ర బాధ్యతని చెప్పుకొచ్చారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఏ వ్యక్తికైనా పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై సందేహాలు తలెత్తడంతో అలాంటిదేమి లేదని, ఆయను హౌస్ రిమాండ్ అవసరం లేదని చెప్తూ ఆంధ్రప్రదేశ్ హోం శాఖ కార్యదర్శి, ప్రస్తుతం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఉన్నహరీష్ గుప్తా అడ్వకేట్ జనరల్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు సంబంధించి కోర్టు జారీ చేసిన అన్ని ఆదేశాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
అలాగే చంద్రబాబు కోసం ప్రత్యేకంగా ఒక వార్డు కేటాయించామని, ఆయన ఉన్న వార్డు వైపు ఎవరిని అనుమతించడం లేదని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, బాబు భద్రతను వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్‌ను కేటాయించామని పేర్కొంటూ రెండు పేజీలు లేఖ రాశారు. ఇంకా ఆ లేఖలో బాబు కోసం ప్రత్యేక వార్డు చెంతనే ఓ వైద్యుల బృందం కూడా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు తరపు లాయర్లు ఆయన రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని పేర్కొంటూ బెయిల్ కోసం ఆయన లాయర్లు కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు ఈ పిటీషన్‌పై రేపు విచారణ జరుపుతామని పేర్కొంది.
కాగా, స్కిల్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం బాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోరినప్పటికీ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు బాబుకు రిమాండ్ విధిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో బాబు భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయని, జైలును కూడా తమ కంట్రోల్‌కి తీసుకునేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, జరుగుతున్న పరిణామాలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలంటూ టీడిపీ లీడర్ నిమ్మకాయల రాజప్ప అన్నారు. ఈ మేరకు హరీష్ గుప్తా బాబు భద్రతపై లేఖ రాశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..