
కర్నూలు, సెప్టెంబర్ 8: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మాజీ ప్రభుత్వ వైద్యుడు వద్ద పనిచేసే మరో ఓ ప్రైవెట్ వైద్యుడి నిర్వాకంతో పసి ప్రాణం బలి అయింది. అయితే ఈ సంఘటన బయటికి రాకుండా పెద్దలతో రాజీ చేసి ఆ కుటుంబానికి కడుపుకోత మిగిల్చారు. ఈ సంఘటనపై వైద్యులు, పోలీస్ అధికారులు మాత్రం తమకు ఏమి ఫిర్యాదు అందలేదంటూ చేతులెత్తేశారు.
పెద్దకడబురు మండలం కంపాడుకు చెందిన బాలుడికి బొడ్డు కింద భాగంలో చీము వస్తుండటంతో బాలుడి తల్లిదండ్రులు గత మూడు రోజుల కిందట ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి పదవి విరమణ పొందిన వైద్యుడు ఏర్పాటు చేసిన వైద్యాశాలకు వెళ్లారు. అక్కడ పనిచేసే జూనియర్ వైద్యుడు మిడిమిడి జ్ఞానముతో, పసిబిడ్డ ప్రాణం అని కూడా చూడకుండా ఓ మెడికల్ షాప్ లోకి బాలుడిని తీసుకువెళ్లి చీము కారుతున్న ప్రదేశంలో వైద్యం చేయాల్సి ఉండగా బ్లేడుతో కోత పెట్టడంతో బాలుడి సున్నితమైన శరీరంలోని పేగులు బయట పడ్డాయి.
దీంతో భయపడి దిక్కుతోచని స్థితిలో పడిన జూనియర్ డాక్టరు గుట్టుచప్పుడు కాకుండా పేగులు బయట పడకుండా, కనిపించకుండా ప్లాస్టర్ వేశాడు. అయితే ఆ బాలుడి తల్లిదండ్రులకు మాత్రం పిల్లవాడికి సీరియస్ గా ఉందని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించి తన తప్పునుండి బయటపడేందుకు ప్రయత్నం మొదలుపెట్టాడు. దీంతో చేసేది లేక పసివాడి తల్లిదండ్రులు ఎలాగైనా తమ బిడ్డను బ్రతికించుకోవాలని వైద్యుడి సూచనతో తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని కర్నూలుకు తరలించారు. అయితే అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికి మృతి చెందాడని చెప్పడంతో బిడ్డను వాపస్ తీసుకొచ్చి గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశారు.
అయితే ఈ మధ్యలో ఏమి జరిగిందో, ఏ పెద్దలు జోక్యం చేసుకున్నారో..రాజీ ఏ రూపంలో జరిగిందో గాని తప్పు మాత్రం జరిగిపోయింది. పసి బాలుడు బలయ్యాడు. అయితే చివరగా కొసమెరుపు ఏమంటే, బాలుడి మృతి విషయం ప్రభుత్వ వైద్యశాల నుండి ఎమ్మెల్సీ ఇంటిమేషన్ ఎమ్మినూరు పట్టణ పోలీసులకు అందినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా బాలుడు మృతికి గల కారకులు, కారణాలపై కూడా సంబంధిత వ్యక్తులతో పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఎమ్మిగనూరు పట్టణ సిఐ మధుసూదన్ రావు స్పందిస్తూ బాధితులు ఫిర్యాదు చేయకపోవడం వల్లనే కేసు నమోదు కాలేదని వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.