Andhra Pradesh: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యలు ఉండవ్..
ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ముద్ద అన్నం కాకుండా వేడివేడి స్టీమ్ రైస్ వడ్డించనున్నారు. మంగళగిరి అక్షయపాత్ర వంటశాలలో స్వయంగా భోజనాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు త్వరలోనే ముద్దగా లేని, చక్కటి స్టీమ్ రైస్ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర కిచెన్‌ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అన్నం ముద్దగా వస్తుందన్న ఫిర్యాదులపై స్పందిస్తూ.. కొత్త బియ్యం సరఫరా కావడం వల్లే ఈ సమస్య తలెత్తుతుందని అక్షయపాత్ర సిబ్బంది మంత్రికి వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి.. అక్షయపాత్రకు సరఫరా అవుతున్న బియ్యం రకం, నాణ్యతకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 63 వేల పాఠశాలల్లో పోషకాహారం
ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు ఒక స్వచ్ఛంద సంస్థగా సమాజానికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. అన్నం సరిగ్గా ఉడకడం లేదనే సమస్య తమ దృష్టికి రావడంతోనే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 63 వేల స్కూళ్ల విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారం అందించడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగానే త్వరలోనే స్టీమ్ రైస్ పంపిణీకి శ్రీకారం చుడతామని ప్రకటించారు.
25 ఏళ్ల ప్రస్థానం.. 500 కోట్ల భోజనాలు
ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఆకలిని తరిమికొట్టి.. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడమే ధ్యేయంగా పనిచేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ తన ప్రస్థానంలో రికార్డు స్థాయి మైలురాయిని అధిగమించింది. 2000 సంవత్సరంలో బెంగళూరులో కేవలం 1500 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ స్వచ్ఛంద మధ్యాహ్న భోజన కార్యక్రమం నేడు మహావృక్షమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యం ఏకంగా 23.50 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ వేడివేడి పోషకాహారాన్ని అందిస్తోంది.
గ్లోబల్ టు నేషనల్ రికార్డ్
2024 ఏప్రిల్ 2న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 400 కోట్ల భోజనాల మైలురాయి వేడుక జరగ్గా.. సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకునే లోపే దేశవ్యాప్తంగా 500 కోట్ల భోజనాలను పంపిణీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. పీఎం పోషణ్ పథకంలో భాగంగా 500 కోట్ల భోజనాల వేడుకను ఢిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఆకలి తీర్చడంలో ఈ సంస్థ అగ్రగామిగా నిలవడం గొప్ప విషయం.
