Andhra Pradesh: విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. గురువారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బిశ్వభూషణ్ హరిచందన్ టీడీపీ నాయుకులతో కలిసి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు. గవర్నర్ ను కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సీఏం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పే సీఏంను జీవితంలో చూడలేదన్నారు. శాసనసభకు వచ్చే మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తారని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటారని, కాని సీఏం జగన్ మాత్రం వాటన్నింటికి తిలోదకాలిస్తూ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెబుతున్నారన్నారు. తన హయాంలో విద్యాసంస్థలు తీసుకురాలేదని జగన్ చెప్పారని, తాను సీఏంగా ఉన్న కాలంలో ఎటువంటి విద్యాసంస్థలు వచ్చామో ప్రజలకు తెలుసన్నారు. తాము ఏం చేశామో ప్రజలు గమనిస్తున్నారని, ఏమి చేయకుండా ప్రజలను మాటలతో జగన్ మభ్య పెడుతున్నారని తెలిపారు.
శాసనసభలో జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిస్తూ.. ఏధైర్యంతో ఎన్టీఆర్ పేరును మార్చే నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. తాను మనస్సులో ప్రశ్నించుకున్నానని, ఎవరితో మాట్లాడారు.. సీఏం వాళ్ల నాన్నతో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ తో పోలిస్తే రాజశేఖర్ రెడ్డి ఏ విషయంలో గొప్ప అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ పేరును తీసేసి రాజశేఖర్ రెడ్డి పేరు ఎలా పెడతారని జగన్ పై మండిపడ్డారు. సత్తా ఉంటే ఓ కొత్త మెడికల్ కాలేజీ, కొత్త యూనివర్సిటీ కట్టాలని సవాలు విసిరారు. పేర్లు మార్చడం ఓ పిచ్చివాడు చేసే పని అంటూ చంద్రబాబు సీఏం జగన్ ని విమర్శించారు. తిరిగి ఎన్టీఆర్ పేరును పునరుద్దరించే వరకు తమ పోరాటం ఆగదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..