ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇంటర్ మొదటి ఏడాది, రెండో ఏడాది సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యాశాఖ మండలి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా కరోనా నేపథ్యంలో 2020-21 కిగాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఇప్పటికే 30 శాతం సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. అదే బాటలోనే ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కూడా నడిచింది. కరోనా నేపథ్యంలో గతేడాది ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన ఇంటర్ బోర్డు ఇటీవలే తిరిగి జూనియర్ కాలేజీలను ప్రారంభించింది. అయితే ఇప్పటికే చాల పనిదినాలు గడిచిపోవడంతో సిలబస్‌ను తగ్గించక తప్పలేదు. ఈ క్రమంలో 30 శాతం సిలబస్ తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సిలబస్ నుంచే 70 శాతం ప్రశ్నలు..
కాగా తొలగించిన సిలబస్‌ను కళాశాలల్లో ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య, ఖాళీ పీరియడ్లలో బోధించాలని ఇంటర్ బోర్డు ఈమేరకు కళాశాలలకు సూచించింది. అయితే ఈ విద్యా సంవత్సరం నిర్వహించే పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని, కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది.