ఏపీ ప్రజలకు హెచ్చరిక! ముఖ్యంగా ఈ జిల్లా వాళ్లు అయితే బయటికి రాకుంటే బెటర్!
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రమైన వడగాలులు, భారీ వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాల్లో వడగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పెరుగుతున్న ఎండల కారణంగా తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఏ జిల్లాల్లో వడగాలులు ఎక్కవగా వీచే అవకాశం ఉందో కూడా వెల్లడించింది. శుక్రవారం (18-03-25) అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంతో పాటు 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.
అలాగే శుక్రవారం(18-04-25) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం (19-04-25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడొద్దని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గురువారం నంద్యాల జిల్లా గోస్పాడు,రుద్రవరంలో 42.1°C, వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 41.5°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4°C, కర్నూలులో 40.7°C, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 40.3°C, అన్నమయ్య జిల్లా పుత్తనవారిపల్లెలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 36 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయొద్దని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
