AP News: ఇదేందిది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే
యూట్యూబ్‌లో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. ఎగ్జామ్ ముందు రోజు యూట్యూబ్‌లో SA మ్యాథ్స్ పేపర్ పెట్టారు నిందితులు. లీక్‌పై పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ్. ఈ కేసులో రామచంద్రపురానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ తీపర్తి వీరవెంకట సుబ్బారావు నిందితుడిగా గుర్తించారు.
ఏపీలో పదో తరగతి అర్ధ సంవత్సరం పరీక్ష పేపర్ యూట్యూబ్‌లో లీకవ్వడం కలకలం రేపింది. సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు సమాధానాలతో సహా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. ఆ తర్వాత ఆ ఎగ్జామ్‌ను ఈ నెల 20వ తేదీన నిర్వహించారు. సాధారణంగా ఫార్మెటివ్, సమ్మెటివ్-1 అసెస్‌మెంట్ల పరీక్ష పేపర్లను.. మండల రిసోర్సు సెంటర్లలో నుంచి సీల్డు కవర్లలో భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజు ఆ పేపర్లను ఎంఈవో నుంచి తీసుకొస్తారు. ఆయా పేపర్ల సీల్‌ను పాఠశాలలోని మిగతా టీచర్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. కానీ ఇంత పక్కాగా ఉండే భద్రతను చేధించి యూట్యూబ్‌లో పేపర్లు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ లీకేజీ వ్యవహారంపై అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన రామచంద్రపురానికి చెందిన తీపర్తి వీరవెంకట సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను సుబ్బారావు యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేశాడని తెలిపారు. అతడు ఆ మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పని చేస్తున్నాడని గుర్తించారు. పరీక్ష జరిగే రెండు రోజుల ముందు సుబ్బారావు గణితం ప్రశ్నాపత్రం తీసుకుని.. అది ఓ విద్యార్ధినికి ఇచ్చారు. ఆ బాలిక దానిని ఆమె టెలిగ్రాం చానెల్‌లో అప్‌లోడ్ చేయగా.. ఆ వెంటనే ప్రైవేటు యూట్యూబ్ చానెల్‌లో ప్రత్యక్షమైంది.
మరోవైపు పాఠశాలల్లో అంతర్గతంగా నిర్వహించే ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. ఇప్పటివరకు ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్‌ల్లో ఉంచిన ప్రశ్నపత్రాలను..ఇకపై పోలీస్ స్టేషన్లకు తరలించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..