Andhra Pradesh: ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు

|

Oct 31, 2022 | 10:24 AM

ఏపీ ప్రభుత్వం నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల దిగుమతికి, ఉత్పత్తికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫ్లెక్సీల వినియోగం, ప్రదర్శన, ముద్రణ, రవాణా వంటివాటిపై నిషేధం విధించింది.

Andhra Pradesh: ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు
Flexies Ban In Andhra Prade
Follow us on

ఏపీలో నవంబర్ ఒకటో తేది నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఒకవైపు ఆనందం.. మరో వైపు ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. నవంబర్‌ ఒకటో తేది నుంచి ప్టాస్టిక్ ఫ్లెక్సీల ప్రింటింగ్‌ నిషేధించడంతో పాటు ఉన్న వాటిని తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫ్లెక్సీ ప్రింటింగ్‌ వ్యాపారస్తులు ఆందోళనకు గురవుతున్నారు. లక్షల రూపాయలు రుణాలు తీసుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వ్యాపార సంస్థలు ఉన్న పళంగా నిషేధిస్తే తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు కాన్వాస్‌లు, గోడలపై ప్రకటనలు రాసే కార్మికులు ఫ్లెక్సీలపై నిషేధంతో తిరిగి తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం నిర్వహించాలన్న నాయకుల ఫ్లెక్సీలతో ఊదరగొడుతుంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి నేతలకు స్వాగతాలు పలుకుతారు.. సభలు, సమావేశాలకు అయితే ఇక కొదవే లేదు. రోడ్డుకిరువైపులా ఫ్లెక్సీలతో నింపేస్తారు.. దీంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధంవైపు అడుగులు వేసింది.. అందులో భాగంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 1వ తేదీ నుండి ఎపిలో ప్లాస్టిక్, ఫ్లెక్సీ బ్యానర్లు పూర్తిగా నిషేధిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుండి ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉత్పత్తిని నిషేధించింది. ఈ విషయంపై వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీ ల స్థానంలో ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని ఫ్లెక్సీ ప్రింటింగ్‌ యజమానులకు అధికారులు సూచించారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను ఇప్పటికే పూర్తిస్థాయిలో నిషేధించాలని, మాంసం దుకాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కవర్ల వినియోగించరాదని హెచ్చరించారు. ఇకపై క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తామని నిబంధనలు పాటించకున్నా, ప్లాస్టిక్ వినియోగిస్తే భారీగా జరిమానా విధించడంతో పాటు, దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల దిగుమతికి, ఉత్పత్తికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫ్లెక్సీల వినియోగం, ప్రదర్శన, ముద్రణ, రవాణా వంటివాటిపై నిషేధం విధించింది. నగరాలు, పట్టణాల్లో అధికారులు దీనికి బాధ్యత వహించాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంచింది. నిబంధనను అతిక్రమించి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే 100 జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నారు.. అందులో భాగంగా ఒంగోలులో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ యజమానులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నవంబర్‌ 1 వ తేది నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్లను పూర్తిగా నిషేధిస్తున్నట్టు వ్యాపార సంస్థల యజమానులకు స్పష్టం చేశారు. ఈ నిషేధాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు, జీఎస్టీ అధికారులు, రవాణా శాఖ అధికారులపై ఉంచారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బదులుగా కాటన్ ఫ్లెక్సీలు, నేత వస్త్రాలు వాడాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపిందని ఒంగోలు మున్పిపల్‌ కార్పోరేషన్‌ కమీషనర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితుల్లో లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకుని ఫ్లెక్సీ ప్రింటింగ్‌ సంస్తలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ప్రకాశంజిల్లాలోనే వందకు పైగా ఫ్లెక్సీ ప్రింటింగ్‌ వ్యాపార సంస్థలు ఉన్నాయని, ప్రస్తుతం వీటి మనగడ ప్రశ్నార్దకంగా మారిందని వాపోతున్నారు. కనీసం ఏడాది పాటు సమయం ఇస్తే ఇతర వ్యాపారాలవైపు మళ్లేందుకు అవకాశం ఉంటుందని కోరుతున్నారు. లేకుంటే ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్‌ రంగంలో పనిచేస్తున్న టెక్నీషియన్లు, డిటిపి ఆపరేటర్లు, వర్కర్లు ఉపాధి లేక రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు కాన్వాస్‌లు, గోడలపై ప్రకటనలు రాసే కార్మికులు ఫ్లెక్సీలపై నిషేధంతో తిరిగి తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్టాస్టిక్‌ ఫ్లెక్సీలు వచ్చిన తరువాత గత 15 ఏళ్లుగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు తిరిగి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ హితంతో పాటు వేలాది మంది కళాకారులకు ఉపాధి లభించేలా సియం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు.

Reporter: Fairoz, TV9 telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..