ఎన్నాళ్లకు – ఎన్నేళ్లకు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు తీరాలకు చేరుకుంది. 39 ఏళ్ల తరువాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983, 1985 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచీ మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు, పట్టు చిక్కక కొన్నాళ్లు అందని నియోజకవర్గం అయ్యింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు.
39 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినపడని మంగళగిరి నియోజకర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు నారా లోకేష్. 1985లో టీడీపీ మంగళగిరిలో గెలిచింది. ఆ తరువాత 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గోలి వీరాంజనేయులు, 1994లో సీపీఎం నుంచి ఎన్ రామమోహనరావు, 1999,2004లో కాంగ్రెస్ నుంచి మురుగుడు హనుమంతరావు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల, 2014,2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి అందని ద్రాక్షలా మారింది. మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగురవేయడమే తన లక్ష్యం అంటూ ప్రతినబూని మరీ అహర్నిశలు కష్టపడి, ప్రజల మనస్సులు గెలుచుకుని నియోజకవర్గంలో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు నారా లోకేష్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…