దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాతా కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతల కామెంట్లతో మైనార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతల వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. కూటమి తరపున ఉమ్మడి ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ సూటిగానే ప్రశ్నిస్తోంది. 4 శాతం రిజర్వేషన్ల అంశంపై వైఖరి చెప్పాకే ఓట్లు అడగాలి అంటూ డిమాండ్ చేస్తోంది.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్ల అంశం తీవ్రస్థాయిలోనే చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రకటించినప్పుడు.. ఏపీకీ అదే వర్తిస్తుందనే వాదనను కొందరు నేతలు వినిపిస్తున్నారు. ఇటీవల దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దుపై తాను ఎక్కడా మాట్లాడలేదని, కూటమిని టార్గెట్ చేసేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే, ఈ విషయంలో బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. IYR కృష్ణారావు లాంటి వారు ఏపీ బీజేపీ నాయకత్వం తీరును బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన రిజర్వేషన్లు తొలగిస్తామని తెలంగాణ బీజేపీ నేతలు చెప్పినట్టే.. ఏపీలోనూ ఉండాలంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రిజర్వేషన్ల దుమారం కాకరేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…