విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా టెన్త్, ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇంటర్, పది పరీక్షలు రద్దు చేసిన నేపధ్యంలో ఫలితాల కోసం రిటైర్డ్ ఐఏయస్ అధికారిణి ఛాయరతన్ కమిటీని నియమించామని తెలిపారు. కమిటీ నివేదిక అందగానే ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఫలితాల ఆధారంగా విద్యార్ధులకు శాస్త్రీయ విధానంలో గ్రేడ్‌లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్‌లు ఉంటాయన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్ధులకు అన్యాయం జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఫలితాలు కేటాయించేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు.
అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని విద్యార్ధులకు ఏవిధమైన అన్యాయం జరగకుండా ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని.. త్వరలోనే యూనివర్పిటీ పనులు పనులు ప్రారంభమవుతాయన్నారు.
అన్ని జిల్లాల్లో యూనివర్పిటీలు ఉన్నా, ప్రకాశంజిల్లాలో మాత్రం యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం విద్యార్ధులకు అన్యాయం చేసిందన్నారు. ఈ యూనివర్సిటీలోనే ప్రతిష్టాత్మకంగా దక్షిణభారత దేశంలో ఎక్కడాలేని విధంగా టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు తెలిపారు.