
మన దేశంలో పుట్టి.. మన దేశంలో ఉంటూ.. కొందరు పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.. పహల్గామ్ ఘటనపై కొందరు స్పందిస్తున్న తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పహల్గామ్ అమరులకు జనసేన నివాళులు అర్పించింది. ఉగ్రదాడి మృతులకు పవన్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని.. కొందరు ఇండియాలో ఉండి పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారు. పాకిస్తాన్‌ను ప్రేమించేవాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ సూచించారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని.. కశ్మీర్ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదంటూ పవన్ చెప్పారు. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు..
పాకిస్తాన్‌తో యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు.. కానీ అందరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అతి మంచితనం చూపిస్తే ఇంటికొచ్చి కాల్చేస్తారన్నారు. భారతదేశంలో దాడి జరిగినప్పుడు సెక్యులరిజం అంటూ కాంగ్రెస్ నాటకాలు వేస్తే అంగీకరించేదిలేదన్నారు. మతం ప్రాతిపదికన చంపుతాం అంటే చూస్తూ ఊరుకోమంటూ పవన్ పేర్కొన్నారు.
టెర్రరిస్ట్ ఘాతుకానికి బలైన మధుసూదన్ కుటుంబ సభ్యులకు జనసేన తరపున 50 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. కేవలం ఆర్ధిక సహాయం మాత్రమే కాదు, ఎలాంటి అవసరాలకైనా జనసేన సిద్ధంగా ఉందన్నారు. సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తన కుమారుడికి ఇప్పుడు అర్ధరాత్రి మేడపై నుంచి పడిపోతున్నట్టు కలలు వస్తున్నాయని..అలాంటిది మధుసూదన్ పిల్లలకు ఎలాంటి ట్రామా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..