
YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. సంక్షేమ పథకాలు అమలులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఏపీలోని అగ్రవర్ణ పేద మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ నగదు జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని.. బటన్ నొక్కి నేరుగా అర్హుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన ఈబీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ సర్కార్ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని ఈ రోజు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కమ్మ, రెడ్డి, క్షత్రియ, బ్రహ్మణ, వెలమ వంటి అగ్రవర్ణాలకు చెందిన పేదల కోసం జగన్ సర్కార్ ఈ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ వర్గాలకు చెంది ఉండి.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లు మధ్య వయస్సు పేద మహిళల ఖాతాల్లో రూ.15వేలు జమ చేయనున్నారు. ఇలా ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించనుంది.
మార్కాపురం పర్యటనకు సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్నారు. 9.55 గంటలకు మార్కాపురం చేరుకుని.. ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేస్తారు.. ఆ తర్వాత బటన్ నొక్కి ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు మార్కాపురం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..