
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ తీగలు తెగి పడి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యుత్ శాఖ ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కం అధికారులను జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా అనంతపురం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాను జగన్ సర్కార్ ప్రకటించింది.
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మృతి చెందడం, ముగ్గురు తీవ్రంగా గాయపడి బళ్లారి ఆసుపత్రిలో చేరడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని.. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారని తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతుల కుటుంబాలను అందరినీ అన్ని విధాల ఆదుకుంటామని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వివరించారు.
విద్యుత్ ప్రమాద స్థలిని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సందర్శించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అందజేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు. బళ్లారిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్ గ్రేషియా ప్రకటించిందన్న ఎస్పీ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యుత్ శాఖను కోరినట్లు వివరించారు.