ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నెల 20 (శుక్రవారం) తో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్దొ కానున్నాయి. దీంతో వంద రోజుల్లో తమ ప్రభుత్వం ఏం చేసిందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుధవారం జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో 100 రోజుల పాలన అంశంపై చర్చ జరగొచ్చని తెలుస్తోంది. వేర్వేరు శాఖలు తమ వందరోజుల ప్రణాళికల ఫలితాలపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన కూడా చర్చ జరుగనుంది. మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రొగ్రెస్ రిపోర్టులు సైతం ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే వాటిని మంత్రులకు ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వంద రోజుల ప్రొగ్రెస్‌ను వివరించడంతోపాటు.. పలు శాఖల నివేదికలపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు.
ఉదయం 11గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఆపరేషన్ బుడమేరు, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలను సుధీర్ఘంగా చర్చించనున్నారు. అంతేకాకుండా కేబినెట్ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలపనుంది. పూర్తిస్థాయి బడ్జెట్‌కు అసెంబ్లీ నిర్వహణపై కూడా చర్చ నిర్వహించనున్నారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేసింది వైసీపీ. గత ప్రభుత్వంపై నిందలు వేయడం మినహా గత నాలుగు నెలల్లో ఏం చేశారో చెప్పాలన్నారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
వైసీపీ ఆరోపణలకు కూటమి ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎంతో విధ్వంసం సృష్టించిందన్నారు మంత్రి సత్యకుమార్. ఐదేళ్ల విధ్వంసాన్ని 90 రోజుల్లో సరి చేయగలమా ? అని ప్రశ్నించారు.
మరోవైపు 100 రోజులు కార్యాచరణ ప్రణాళిక అమలపై శాఖల కార్యదర్శులతో సీఎస్ నీరబ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రోడ్లను వంద రోజుల్లోగా గుంతలు లేకుండా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే డ్రోన్ల ద్వారా గుంతలను గుర్తించాలని ఆదేశించారు. తమ ప్రాంతాల్లోని రోడ్లపై గుంతలు లేవని.. సంబంధిత అధికారులతో సర్టిఫికెట్లు తీసుకోవాలన్నారు. ప్రమాదకర పరిశ్రమల్లో మూడు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ తప్పక జరగాలన్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదని వైసీపీ విమర్శలు చేస్తుంటే.. ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రజలకు ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు కూటమి పార్టీలు రెడీ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..