AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP BJP: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా టీడీపీని కాపాడటం కోసం పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి ఆరోపించడంతో కలకలం రేగింది. మరోవైపు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

AP BJP: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు
Daggubati Purandeswari
Balaraju Goud
|

Updated on: Nov 07, 2023 | 7:45 AM

Share

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా టీడీపీని కాపాడటం కోసం పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి ఆరోపించడంతో కలకలం రేగింది. మరోవైపు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ జగన్‌ ప్రభుత్వంపై వ‌రుస‌గా విమ‌ర్శలు చేయడం తప్ప పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి సారించట్లేదనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీలో అంతర్గత విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. తమ అధ్యక్షురాలు పార్టీ బలోపేతానికి కాకుండా చంద్రబాబుకు పరోక్షంగా సహకరిస్తున్నారని కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నారని సమాచారం. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు సీజేకు పురందేశ్వరి లేఖ రాయడంతో బీజేపీ నేతలు బాహాటంగా విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఏపీ బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడినట్లైంది.

అసలు పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా తన మరిది చంద్రబాబు కోసం, టీడీపీని కాపాడటం కోసం పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి ఆరోపించారు. సొంత పార్టీలో కీలక నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. స్వప్రయోజనాల కోసం పురందేశ్వరి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని, పొత్తులో భాగంగా ఆమె ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా పురందేశ్వరి వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా ఎవరినీ మాట్లాడకుండా పురందేశ్వరి అడ్డుకుంటున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. సుబ్బారెడ్డి ఆరోపణలతో బీజేపీలో వర్గ విభేదాలు బయటికి వచ్చినట్లైంది. మరోవైపు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. పురంధేశ్వరి ఆలోచన విధానాల్లో ఏదో తేడా ఉందన్నారు విజయ సాయిరెడ్డి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పురంధేశ్వరి కూడా కేంద్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారట. దీంతో ఆమెపై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు పార్టీ సీనియర్ నేతలు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా పురంధేశ్వరిని సమర్థిస్తున్నారు. ఎంతైనా పార్టీలో విభేదాలు బయటపడటం ఏపీ బీజేపీకి కొత్త తలనొప్పిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..