Anantapur Urban: అనంతపురం అర్బన్ టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠ.. టికెట్ దక్కెదెవరికి..?

అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి మొదట జనసేన పోటీ చేయాలని భావించింది. అయితే తాజాగా జనసేన అనంతపురం అర్బన్ లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అనంతపురం అర్బన్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది.

Anantapur Urban: అనంతపురం అర్బన్ టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠ.. టికెట్ దక్కెదెవరికి..?
Prabhakar Chowdary

Updated on: Mar 23, 2024 | 6:55 PM

మూడో లిస్టులో కూడా అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ ఎవరికీ అనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరపున గోనుగుంట్ల సూర్యనారాయణ, గుంతకల్లులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తోంది. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క నియోజకవర్గం అనంతపురం అర్బన్.

అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి మొదట జనసేన పోటీ చేయాలని భావించింది. అయితే తాజాగా జనసేన అనంతపురం అర్బన్ లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అనంతపురం అర్బన్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కొండవీటి భావన, దగ్గుపాటి ప్రసాద్ టికెట్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ దోబూచులాడుతుందట.

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మూడో లిస్టులో కూడా అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి పేరు లేదు. దీంతో ఆశావాహుల్లో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ కోసం అరడజనుపైనే ఆశావాహులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. వడపోతలో ఫైనల్‌గా ముగ్గురు టికెట్ రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కొండవీటి భావన, దగ్గుబాటి ప్రసాద్‌ల మధ్య టికెట్ నీకా? నాకా? అన్నట్లు పోటీ ఉంది. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ మొదట మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేరే వినిపించినప్పటికీ…. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టికెట్ కోసం మరింత పోటీ ప్రభాకర్ చౌదరికి ఎదురైంది. ముఖ్యంగా కొండవీటి భావన అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. అదేవిధంగా రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ కూడా టికెట్ కోసం చాప కింది నీరులా పావులు కదుపుతున్నారు.

ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఎవరు అంటే.. ప్రధానంగా కొండవీటి భావన, దగ్గుపాటి ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేకపోయినప్పటికీ.. ఆర్థికంగా కొంత వీక్ గా ఉన్నాడని, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గంలో ప్రభాకర్ చౌదరికి కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ప్రభాకర్ చౌదరికి కాకుండా ప్రత్యామ్నాయం కోసం వెతకడం మొదలుపెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా అంగ బలం, అర్థ బలం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ నాయుడు పేరు టీడీపీ అధిష్టానం పరిశీలించిందట. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకుండా.. మరలా అదే సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ నాయుడుకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఏముంటుంది అనే ఉద్దేశం కూడా టీడీపీ అధిష్టానం ఆలోచించిందట. దీంతో సుధాకర్ నాయుడు సతీమణి కొండవీటి భావన పేరు తెర మీదకు వచ్చింది.

బలిజ సామాజి వర్గానికి చెందిన కొండవీటి భావన పేరు పరిశీలించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళ…. రెండు మహిళా అభ్యర్థి. మూడు భర్త బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దీంతో అటు బలిజ సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేయొచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. ఇటు మహిళా ఓటర్లను తన వైపుకు తిప్పుకోవచ్చు. మరోవైపు భర్త కమ్మ సామాజిక వర్గం కాబట్టి అటు కమ్మ సామాజిక వర్గ ఓటర్లు కూడా గంప గుత్తగా సుధాకర్ నాయుడుని చూసి కొండవీటి భావనకు ఓట్లు పడతాయనే ఉద్దేశం కూడా టీడీపీ అధిష్టానం ఆమె పేరు పరిశీలనలో తీసుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇక రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. టికెట్ ఇస్తే ఎంతైనా ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారట దగ్గుపాటి ప్రసాద్. దగ్గుపాటి ప్రసాద్ కు దాదాపు 600 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే పాలిమర్స్, రియాక్టర్స్ తయారు చేసే కంపెనీ ఉంది. దగ్గుబాటి ప్రసాద్ ఫైనాన్షియల్ గా బలంగా ఉండటం కూడా ఆయన పేరు పరిశీలనలో తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి అనంతపురం అర్బన్ లో బలమైన క్యాడర్ ఉంది. నాలుగున్నర సంవత్సరాలు నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. కాకపోతే ఫైనాన్షియల్ గా కొంత వీక్ గా ఉన్నారని, అదేవిధంగా బలమైన కమ్మ సామాజిక వర్గంలోని నాయకులు ప్రభాకర్ చౌదరికి దూరమైనట్లు టీడీపీ అధిష్టానం భావిస్తుందట. ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గం టీడీపీకి దూరమవుతుందేమోనన్న ఉద్దేశం టీడీపీ అధిష్టానంలో ఉందట. రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ అనంతపురం అర్బన్ లో క్యాడర్ లేకపోవడం కొంత మైనస్ గా కనిపిస్తోందట.

ఇక కొండవీటి భావనకు అనేక రకాలుగా కలిసివచ్చే అంశాలు ఉన్నాయట. భర్త సుధాకర్ నాయుడు కమ్మ సామాజిక వర్గం.. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండడం, కొండవీటి భావన బలిజ సామాజిక వర్గం, మహిళా అభ్యర్థి అవడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభాకర్ చౌదరికి అనంతపురం అర్బన్ టికెట్ లేదని చెప్పకపోయినప్పటికీ, అర్బన్ టికెట్ మరింత ఆలస్యం అవ్వడం ప్రభాకర్ చౌదరికి టికెట్ లేదేమో అన్న అనుమానాలను కలిగిస్తోందని టీడీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటోంది. దాదాపు టీడీపీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. మరొక ఐదు, ఆరు స్థానాలు పెండింగ్ ఉన్నాయి. అందులో అనంతపురం అర్బన్ కూడా ఒకటి. ప్రభాకర్ చౌదరి, కొండవీటి భావన, దగ్గుపాటి ప్రసాద్ వీరి ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొడంతోనే అనంతపురం అర్బన్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుందట. అనంతపురం అర్బన్ టికెట్ పై నెలకొన్న ఉత్కంఠకు మరో రెండు రోజుల్లో తెరపడే అవకాశం ఉంది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…