AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అర్ధరాత్రి హల్‌చల్.. పెళ్లి బృందంపై మందుబాబుల వీరంగం!

అన్నవరం సత్యదేవుని ఆలయం వద్ద అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. సత్యగిరి కొండపై ఉన్న ఉచిత కల్యాణ మండపాల వద్ద పెళ్లి బృందం, భక్తులపై దాడికి పాల్పడ్డారు. మహిళలను, సెక్యూరిటీ గార్డును కొట్టడంతో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అర్ధరాత్రి హల్‌చల్.. పెళ్లి బృందంపై మందుబాబుల వీరంగం!
Annavaram Ruckus
Balaraju Goud
|

Updated on: Aug 27, 2026 | 12:36 PM

Share

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేయడం కలకలం రేపింది. సత్యగిరి కొండపై ఉన్న ఉచిత కల్యాణ మండపాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహ బృందాలు, భక్తులతో ప్రాంతం రద్దీగా ఉన్న సమయంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో మద్యం సేవించిన యువకులు వివాదానికి దిగినట్లు స్థానికులు తెలిపారు.

మద్యం మత్తులో ఉన్న యువకులు ఎదురుగా వస్తున్న ఓ కారును ఆపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. కారులో ప్రయాణిస్తున్న భక్తులతోనూ దురుసుగా ప్రవర్తిస్తూ గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో భక్తులపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడితో ఆగకుండా యువకులు తమ కారును పార్క్ చేసి, ఓ వివాహ బృందానికి చెందిన పలువురు మహిళలపై దాడికి పాల్పడ్డారు. కర్రలతో, కాళ్లతో మహిళలను కొట్టడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. మహిళలను రక్షించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుపైనా యువకులు పిడిగుద్దులతో దాడికి తెగబడ్డట్లు స్థానికులు తెలిపారు.

గొడవ అనంతరం యువకులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శర్బవరం ప్రాంతానికి చెందిన వివాహ బృందం సభ్యులకు కొద్దిసేపటి తర్వాత హరి హర సదన్ వసతి గదుల సమీపంలో దాడికి పాల్పడిన యువకులు కనిపించారు. దీంతో భక్తులు, స్థానికులు వారిని అడ్డుకుని దేవస్థానం హోంగార్డులు, సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఒంటిమామిడి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జగన్మోహన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గొడవ ప్రాంతంలో ఉన్న యువకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం, ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు దాడిలో స్వల్పంగా గాయపడిన వివాహ బృందంలోని మహిళలు తీవ్ర భయాందోళనకు గురై కన్నీరు పెట్టుకున్నారు. స్థానికులు, భక్తులు వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, దాడికి దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us