Donkey Meet: గుంటూరులో విచ్చలవిడితనం.. దర్జాగా గాడిద మాంసం అమ్మకాలు.. కట్ చేస్తే..
గుంటూరులో విచ్చలవిడిగా గాడిద మాంసాన్ని విక్రయిస్తున్న వారిని జంతు ప్రేమికులు రెడ్ హ్యాండెడ్‌గా బుక్ చేశారు. అడ్డుఅదుపులేకుండా రోడ్డుపై బహిరంగంగా గాడిద మాంసం అమ్ముతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతు ప్రేమికుల ఫిర్యాదుతో మాంసం విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో జంతుప్రేమికులతో వాగ్వాదానికి దిగారు మాంసం విక్రయదారులు.
గుంటూరు నగరంలో గాడిద మాంసం విచ్చలవిడి విక్రయాలుపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో గాడిద మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే బ్లూ క్రాస్ సొసైటీ సభ్యుడు జాగు సురేష్ విక్రయాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి మాంసం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని మాంసాన్ని స్టేషన్ కు తరలించారు. అయితే నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద మాంసం విక్రయదారులు బ్లూ క్రాస్ సొసైటీ సభ్యుడు పై దాడికి యత్నించారు. లంచాలు ఇవ్వడం లేదని మిమ్మల్ని వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బ్లూ క్రాస్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ యధేచ్చగా గాడిద మాంసం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదన్నారు. తాము లంచం తీసుకున్న ఆరోపణలను కొట్టి వేశారు. మున్సిపల్, ఆహార భద్రత, నియంత్రణ అధికారులతో కలిసి దాడులు చేయాల్సి ఉండగా పట్టించుకోవటం లేదన్నారు. గాడిద మాంసం తినకూడదని ఆహార నియంత్రణ అధికారులు చెబుతున్నా కొంతమందికి చెవికెక్కడం లేవన్నారు. అంతరించిపోతున్న జాతుల్లో గాడిదలు ఒకటన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో గాడిద మాంసం వల్ల వెన్నునొప్పి, ఆస్తమా నయం అవుతుందనే నమ్మకం ఉందని, లైంగిక శక్తిని పెంచేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారని ప్రచారం ఉంది. ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో గాడిద మాంసాన్ని విరివిగా విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఐపిసి సెక్షన్ 429 ప్రకారం గాడిదలను చంపడాన్ని భారతదేశం నిషేధించింది. ఇది ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. విశేషమేమిటంటే, అటువంటి సందర్భాలలో నిందితులపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కూడా అమలు చేయబడుతుంది. అదనంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం గాడిద మాంసం వినియోగం చట్టవిరుద్ధం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం