ఆంధ్ర అరుణాచలం.. దక్షిణ కాశీ! కుందుర్పమ్మ కొండలో ఆధ్యాత్మికతతో పాటు ఎన్నో చారిత్రక విశేషాలు
Kundurpi Kundurupamma Temple Histery Telugu: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కుందుర్పి ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధి. ఆంధ్ర అరుణాచలం, దక్షిణ కాశీగా పేరొందిన కుందుర్పమ్మ కొండపై ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. సహజసిద్ధమైన కొలనులు, పురాతన మండపం, ధాన్యాగారం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

Kundurpi Kundurupamma Temple Histery Telugu: అనంతపురం జిల్లా కుందుర్పి ప్రకృతి అందాలకు ఆధ్యాత్మిక విశిష్టతకు నిలయంగా మారింది. గ్రామదేవతగా కొలువైన కుందుర్పమ్మ అమ్మవారి కొండ.. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఎన్నో చారిత్రక విశేషాలను అందిస్తోంది. అందుకే భక్తులు ఈ ప్రాంతాన్ని ఆంధ్ర అరుణాచలం, దక్షిణ కాశీగా పిలుచుకుంటారు. ప్రతి పౌర్ణమికి కుందుర్పమ్మ కొండ భక్తులతో సందడిగా మారుతోంది. ప్రతి పౌర్ణమికి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. కలియుగం ఆరంభం నుంచే కుందుర్పమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారనే విశ్వాసం స్థానికుల్లో ఉంది. అమ్మవారి పేరుతోనే కుందుర్పి గ్రామం ఏర్పడిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. పెద్ద కొండపై రాతి శిల రూపంలో అమ్మవారు కొలువై పూజలు అందుకుంటున్నారు. ఐదేళ్లకోసారి జరిగే కుందుర్పమ్మ జాతరకు కర్ణాటక, తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
కేవలం ఆధ్యాత్మికతే కాదు.. కుందుర్పమ్మ కొండ ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో కోనేటి రాజుల పాలనకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. కొండపై కనిపించే ఎనిమిది స్తంభాల మండపం నాటి నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొండపై ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న ధాన్యాగారపు గిడ్డంగి కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అప్పటి ప్రజల జీవన విధానాన్ని గుర్తు చేసేలా ఈ నిర్మాణం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక కుందుర్పమ్మ కొండలోని సహజసిద్ధమైన కొలనులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గుర్రపు కొలను, రామలక్ష్మణుల కొలను, అక్కాచెల్లెల కొలనులు ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
అక్కాచెల్లెల కొలనులకు సంబంధించి స్థానికంగా ఓ ఆసక్తికరమైన విశ్వాసం ఉంది. అక్క కొలనులో దూకితే చెల్లి కొలనులో సొరంగ మార్గం గుండా బయటకు వస్తారు. ఈ కొలనుల వద్ద గంగ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటే సంతాన ప్రాప్తి, కళ్యాణ యోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తొలకరి చినుకులతో తడిసిన పచ్చని కొండలు మేఘాల మధ్య కనిపించే గిరి శిఖరాలు, రాళ్లు, రప్పలతో కూడిన కొండదారులు.. సహజసిద్ధమైన నీటి కొలనులు.. కుందుర్పమ్మ కొండకు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వేసవిలోనూ కొన్ని సహజ కొలనుల్లో నీరు ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకతను మరింత పెంచుతోంది. ప్రతి ఉగాది రోజున గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకుని పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఇలా ప్రకృతి చరిత్ర ఆధ్యాత్మికత కలగలిసిన కుందుర్పమ్మ కొండ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
వీడియో చూడండి..




