విశాఖలో ఒకవైపు జోరువాన, మరోవైపు జారుతున్న కొండ. భయంతో వణికిపోతూ.. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఇళ్లను ఖాళీ చేశారు జనం. పునరావాస కేంద్రంలో భయంతో గడుపుతున్నారు. అసలింతకీ.. కొండవాలు ప్రాంతంలో ఏం జరుగుతుందనేది అందరికీ ఆందోళన కలిగిస్తోంది.. గోపాలపట్నంలో ప్రమాదకరంగా మారింది కొండవాలు ప్రాంతం. భారీ వర్షాలకు.. కొండ కొంతమేర కూలిపోయింది. రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో.. అక్కడి ప్రజల్ని ఖాళీ చేయించారు రెవెన్యూ, పోలీస్ అధికారులు. గంటగంటకూ.. కొండ ప్రాంతంలో భూమి కిందకు జారుతుండటంతో.. తమ ఇళ్లు కూలిపోతాయేమోనని తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్థానికులు. ప్రమాదం పొంచి ఉండటంతో.. కొండపైన నివసించే కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు. ఎమ్మెల్యే గణబాబు స్వయంగా కొండవాలు ప్రాంతానికి వెళ్లి ప్రజల్ని అప్రమత్తం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ఒక్కో కుటుంబాన్ని కొండవాలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లను ఖాళీ చేయించారు. విద్యు్త్ సరఫరా నిలిపివేయించారు. 25 నుంచి 30 కుటుంబాలను కొండవాలు ప్రాంతం నుంచి తరలించి.. లక్ష్మీపురం స్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి పంపారు.
ప్రతి పది నిమిషాలకు కొండభాగంలోని కొంత కూలుతుంది. దీంతో.. కొండ కింద ఉన్న ప్రజల్ని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కొండ ప్రాంతం మీద ఉన్న ఇళ్లు కూలితే.. ఆ శిథిలాలు.. పక్కనే ఉన్నభవనాలపై పడే అవకాశం ఉందని.. రెవెన్యూ, పోలీస్ అధికారులు చెబుతున్నారు. ప్రాణ నష్టం జరగకూడదనే.. ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కొండవాలు నుంచి ఖాళీ చేసిన ప్రజలు.. కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లగా.. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూలితే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పునరావాస కేంద్రంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే గణబాబు. కొండవాలు కింది ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటు చేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. కొండపైకి ఎవ్వరూ వెళ్లకూడా హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..