తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చిత్ర విచిత్రంగా ఉంటోంది. ఉదయం, సాయంకాలం వేళల్లో తీవ్రమైన చలి చంపేస్తుండగా.. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే, గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దానికి కారణం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తాజాగా భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం అది ట్రింకోమలీ(శ్రీ లంక)కి తూర్పున 340 కిమీ దూరంలో, కారైకాల్ (భారతదేశం)కి తూర్పు ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇవాళ సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా పునరావృతం చెందే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న ఉదయం సమయంలో శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య/తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం రాబోయే మూడు రోజులకు ఏపీలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి నివేదిక విడుదల చేశారు అధికారులు. ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో మంగళవారం, బుధవారం నాడు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో మంగళవారం, బుధవారం తేలికపాటు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం నాడు పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో మంగళవారం, బుధవారం నాడు తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం నాడు పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..