Vijayawada: ‘ఆ సామాజిక వర్గానికి కాదు.. మాకే ఇవ్వాలి’.. బెజ‌వాడ ఎంపీ సీటుపై కొత్త డిమాండ్

ప్రస్తుతం విజ‌య‌వాడ‌ ఎంపీగా టీడీపీ నుంచి కేశినేని నాని ఉన్నారు...ఈ పార్లమెంట్‌ ప‌రిధిలో విజ‌య‌వాడ ఈస్ట్,విజ‌య‌వాడ సెంట్ర‌ల్,విజ‌య‌వాడ వెస్ట్,మైల‌వరం,నందిగామ‌,తిరువూరు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి...వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఈసీటుపై టీడీపీ నుంచి కేశినేని బ్రదర్స్‌ క‌న్నేసారు...మూడోసారి తానే ఎంపీ అభ్యర్థినని కేశినేని నాని చెబుతుండ‌గా....త‌న‌కే సీటు వ‌స్తుందంటూ కేశినేని చిన్ని ఆశతో ఉన్నారు.

Vijayawada: ఆ సామాజిక వర్గానికి కాదు.. మాకే ఇవ్వాలి.. బెజ‌వాడ ఎంపీ సీటుపై కొత్త డిమాండ్
Vijayawada

Edited By: Basha Shek

Updated on: Dec 12, 2023 | 6:44 PM

ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న అన్ని లోక్ స‌భ స్థానాల్లో కీల‌క‌మైంది బెజ‌వాడ‌. ఈలోక్ స‌భ స్థానంలో కొన్నేళ్లుగా అన్ని పార్టీల‌ది ఒక‌టే మాట‌…తెలుగుదేశం అయినా,కాంగ్రెస్ అయినా,వైఎస్సార్ సీపీ అయినా..పార్టీ ఏదైనా సీటు మాత్రం ఆ సామాజిక‌వ‌ర్గానిదే…కానీ వారి ఓట్లు మాత్రం చాలా త‌క్కువ‌..అయితే ఈ సారి అక్కడ ట్రెండ్ మార్చాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కీల‌క‌మైన ఆ ఎంపీ సీటును ఈసారి బీసీల‌కు ఇవ్వాల‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది…బీసీల‌కు టిక్కెట్ ఇచ్చే పార్టీకే త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని ప్రచారం కూడా చేస్తున్నారు కొంత‌మంది బీసీ సంఘాల నాయ‌కులు. ప్రస్తుతం విజ‌య‌వాడ‌ ఎంపీగా టీడీపీ నుంచి కేశినేని నాని ఉన్నారు…ఈ పార్లమెంట్‌ ప‌రిధిలో విజ‌య‌వాడ ఈస్ట్,విజ‌య‌వాడ సెంట్ర‌ల్,విజ‌య‌వాడ వెస్ట్,మైల‌వరం,నందిగామ‌,తిరువూరు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి…వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఈసీటుపై టీడీపీ నుంచి కేశినేని బ్రదర్స్‌ క‌న్నేసారు…మూడోసారి తానే ఎంపీ అభ్యర్థినని కేశినేని నాని చెబుతుండ‌గా….త‌న‌కే సీటు వ‌స్తుందంటూ కేశినేని చిన్ని ఆశతో ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ లో కేశినేని బ్రదర్స్‌ రెండు గ్రూపులుగా పార్టీ నేత‌ల్లో చీలిక తెచ్చారు. అటు వైసీపీ నుంచి అభ్యర్థి ఎవ‌ర‌నేది ఇంకా ప్రకటించలేదు.1952 లో విజ‌య‌వాడ లోక్ స‌భ స్థానానికి మొద‌టిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి.మొద‌టిసారి ఎంపీగా హ‌రీంద్రనాథ్‌ ఛ‌టోపాధ్యాయ గెలిచారు. అప్పటి నుంచి 2019 వ‌ర‌కూ మొత్తం 17 సార్లు విజ‌య‌వాడ లోక్ స‌భ స్థానానికి ఎన్నిక‌లు జ‌రిగాయి..అయితే ఒక్కసారి ఇండిపెండెంట్ మినహా మిగిలిన 16 సార్లు కాంగ్రెస్ లేదా టీడీపీ సీట్లు ద‌క్కించుకున్నాయి. మొత్తం 14 సార్లు ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తులు బ‌రిలో నిల‌బ‌డ‌టం,గెల‌వ‌డం కూడా జ‌రిగింది.1980 నుంచి వ‌రుస‌గా క‌మ్మ సామాజిక‌వర్గం వారే ఎంపీలుగా గెలుస్తూ వ‌చ్చారు..2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్‌ కూడా ఇదే సామాజిక‌వ‌ర్గం కావ‌డం విశేషం.

క‌మ్మ సామాజిక వ‌ర్గానికి కాకుండా బీసీల‌కు ఇవ్వాల‌నే వాద‌న‌

విజ‌య‌వాడ ఎంపీగా కేశినేని నాని రెండోసారి గెలిచారు..వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నేనే ఎంపీ అభ్యర్థినంటూ ఆయ‌న స్వయంగా ప్రకటించేసుకున్నారు..ఇదే స‌మ‌యంలో వైసీపీ ఏ సామాజిక వ‌ర్గానికి సీటు ఇస్తుంద‌నే స్పష్టత రాలేదు.తాజాగా విజ‌య‌వాడ సీటుపై కొత్త వాద‌న తెర‌పైకి వ‌స్తుంది. ప్రతిసారి అన్ని పార్టీలు కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గానికే సీటు ఇవ్వడం స‌రికాద‌ని బీసీ సంఘాల నేత‌లు అంటున్నారు. గత ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ నుంచి కేశినేని నానికి సీటు ఇవ్వగా…వైసీపీ నుంచి పొట్లూరి వరప్రసాద్‌కు సీటు ఇచ్చారు. అంత‌కు ముందు కూడా వ‌రుస‌గా అన్ని పార్టీలు క‌మ్మ సామాజిక వ‌ర్గానికే సీట్లు ఇస్తూ వ‌చ్చాయి…అయితే విజ‌య‌వాడ పార్లమెంట్‌ ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌లిపి మొత్తం 16లక్షల ఓట‌ర్లు ఉంటే వాటిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వ‌ర్గాల ఓట్లు 14 ల‌క్షల వ‌ర‌కూ ఉన్నట్లు అంచ‌నా. ఇక బీసీలు,మైనార్టీలు క‌లిపి 8 ల‌క్షల వ‌ర‌కూ ఉన్నట్లు ఒక అంచ‌నా వేస్తున్నారు. గ‌త 70 ఏళ్లలో ఒకే సామాజిక వ‌ర్గానికి సంబంధించిన వారు 14 సార్లు ఎంపీ కావ‌డంతో ఇత‌ర వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని బీసీ సంఘాల నేత‌ల వాద‌న‌.అందుకే ఈసారి బీసీల‌కే టిక్కెట్ ఇవ్వాల‌నే డిమాండ్ ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఎక్కువ‌గా వినిపిస్తుంది…ఈ డిమాండ్ ను ప్ర‌జ‌ల‌తో పాటు అన్ని పార్టీల్లోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు కొన్ని సంఘాల నాయ‌కులు ఉద్య‌మ‌బాట కూడా ప‌ట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

బీసీ జానాభా ప్రాతిప‌దిక‌న త‌మ‌కే సీటు ఇవ్వాలని కోరుతున్న నేత‌లు

ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల నేత‌ల‌కు బీసీ సంఘాల నుంచి విజ్ఞప్తులు కూడా అందించామంటున్నారు బీసీ సంఘాల నేతలు..అయితే జ‌నాభాతో సంబంధం లేకుండా క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉంటుంది..అందుకే అన్ని పార్టీలు ఆ సామాజిక వ‌ర్గానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నాయి.అయితే ఈసారి వైఎస్సార్ సీపీ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి కాకుండా వేరే వారికి సీటు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నట్లు తెలిసింది..ఇలాంటి ప‌రిస్థితుల్లో బీసీల డిమాండ్ పై ఏ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.