AP Politics – TDP: టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకు పని చేయని నేతలకు క్లాస్ పీకేవారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేదంటే వేటు తప్పదని హెచ్చరిస్తుండేవారు. పని చేయని వారిని పక్కన పెట్టి.. సమర్థులకే పెద్దపీట వేస్తామని చెబుతూ వస్తుండేవారు. అయితే, ఇక నుంచి మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అంటూ పని చేయని, పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించే వారిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే సదరు నేతలను ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు.
గత వారం రోజులుగా నలుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. పార్టీ నేతల్లో కలవరం రేపుతోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, నేతలు పనితీరుపై వరుస సమీక్షలు చేస్తున్నారు చంద్రబాబు. అందులో నేతలపై ఒక రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు చూశాం.. ఇకపై పని చేయని వారికి పార్టీ లో ప్రాధాన్యత ఉండదని తేల్చి చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించారనే కారణంతో నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేలూరు రంగారావు, మాజీ గ్రంధాలయ ఛైర్మన్ కిలారు వేంకట స్వామీ నాయడు లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నుడా మాజీ డైరెక్టర్ ఖాజావలి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లి నిర్మల లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతోనే వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
నేతల్లో గుబులు..
చంద్రబాబు యాక్షన్ చూసి పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఇంకా ఎవరెవరిపై వేటు ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు నేతల నుంచి ఓటమిపై వివరణ కోరారు చంద్రబాబు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా, ఏ స్థాయి నేత అయినా చర్యలు తప్పదని ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు.. ఇపుడు యాక్షన్ మొదలు పెట్టడంతో పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. మరి కొందరు నేతల వ్యవహారంపైనా చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉన్నాయని, వారిపైనా వేటు తప్పదనే టాక్ నడుస్తోంది. చంద్రబాబు గతంలో లాగా లేరని.. ఇప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారి పార్టీ నేతలు అంటున్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో సీరియస్ గానే ఉంటున్నారని అన్నారు. ఇలా ఉంటేనే పార్టీ మనుగడ కొనసాగుతుందని సీనియర్ నేతలు అంటున్నారు.
Also read: