Andhra poll violence: అల్లర్లపై సిట్‌ ప్రాథమిక నివేదిక రెడీ.. నేడు డీజీపీ చేతికి

|

May 20, 2024 | 8:25 AM

ఏపీలో జరిగిన పోస్ట్‌పోల్‌ అల్లర్లపై దర్యాప్తు చేసిన సిట్‌..ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. మూడు జిల్లాల్లో జరిగిన ఘటనలపై ఆరా తీసిన సిట్‌.. FIRలలో అదనపు సెక్షన్లు చేర్చడంతో పాటు మరికొంతమందిని నిందితులుగా గుర్తించింది. నేడు డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సిట్‌ చీఫ్‌..పూర్తి నివేదికను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.

Andhra poll violence:  అల్లర్లపై సిట్‌ ప్రాథమిక నివేదిక రెడీ.. నేడు డీజీపీ చేతికి
Poll Violence In Andhra
Follow us on

ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానికులు, పోలీసుల ద్వారా అసలేం జరిగిందో తెలుసుకున్నారు. తాడిపత్రి అల్లర్లపై నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పరిశీలించింది. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను SHOలను అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులను వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేశారు.

తిరుపతిలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సిట్‌ బృందం.. తిరుపతి, చంద్రగిరిలో నమోదైన కేసులపై ఆరా తీసింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన దాడులతో పాటు యూనివర్సిటీ పీఎస్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను సిట్ అధికారులు తెలుసుకున్నారు. పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టపైన భద్రత ఉంటే మారణాయుధాలు ఎలా వచ్చాయని పోలీసులను ప్రశ్నించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సిట్‌ బృందం పర్యటించింది. మల్లమ్మ సెంటర్‌లో వాహనం తగలపెట్టిన స్థలాన్ని, MLA ఇంటి దగ్గర స్థలాన్ని అధికారులు పరిశీలించారు. దాచేపల్లి, మాచవరం మండలాల్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐ నుంచి తెలుసుకున్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీశారు.

మరోవైపు పల్నాడులో హింసకు చంద్రబాబే కారణమని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఓడిపోతాననుకున్నప్పుడు కుట్రలు చేస్తాడని.. పోలీస్‌ అధికారుల మార్పులు వల్లే హింస జరిగిందన్నారు. టీడీపీపై ఈసీకి నాలుగు ఫిర్యాదులు చేశారు వైసీపీ నేతలు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్‌ టీమ్.. మరికొంతమంది నిందితులను కూడా గుర్తించింది. అయితే సిట్‌ నివేదికలో ఏఏ అంశాలను ప్రస్తావిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…