PM Modi: అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. మరణించిన వ్యక్తుల పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు, గాయాలైన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ట్వీట్ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం చాలా బాధ కలిగించింది. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అందజేస్తామని ‘ అన్నారు.
ఆదివారం సాయంత్రం అనంతపురం-బళ్లారి జాతీయ రహదారి విడపనకల్ మండలం కొటాలపల్లి సమీపంలో ఇన్నోవా కారు వస్తోంది. అదే సమయంలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు మహిళలు, ఒక బాలుడు, ఇద్దరు పురుషులు విగతజీవులుగా మారారు. మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్‌కు చెందిన వారు కాగా ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారు.
మృతుల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప కూడా ఉన్నారు. ఆయన కుమార్తె వివాహానికి బళ్లారి వెళ్లి తిరిగి వస్తుండగానే ఈ దుర్ఘటన జరిగింది. కోకా వెంకటప్ప 25 సంవత్సరాలుగా బిజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. వెంకటప్పతో పాటు అతని కుటుంబ సభ్యులు మరణించడం పట్ల బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా PMNRF నుండి చెల్లిస్తాం: ప్రధానమంత్రి @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2022