AP New Governor Abdul Nazeer: ఏపీ నుంచి బదిలీపై వెళ్తున్న గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం నిన్న ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ హాజరై గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఉద్వేగ భరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అలాగే గవర్నర్, సీఎం జగన్ ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 24వ తేదీన గవర్నర్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు రాజ్ భవన్ వర్గాల వారు. ఇవాళ ఏపీకి రానున్నారు అబ్ధుల్ నజీర్. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
ఏపీకి మూడో గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకు చెందిన అబ్ధుల్ నజీర్.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అయిన మూడో న్యాయమూర్తిగా నజీర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయన ఫిబ్రవరి మాసాంతానికి ఒక రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తుండటం విశేషం.
ఇక సుప్రీం న్యాయమూర్తిగా నజీర్ ట్రాక్ రికార్డులు పరిశీలిస్తే.. ఆయన పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య- బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనార్టీ న్యాయమూర్తి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..