MP Avinash Reddy: బెయిలా.. లేక సీబీఐ విచారణ..? ఎంపీ అవినాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో మరోసారి విచారణ

|

Apr 18, 2023 | 7:25 AM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నాలుగేళ్ల తర్వాత స్పీడ్‌ అందుకుంది. కారణాలు ఏవైనా.. సీబీఐ మాత్రం దర్యాప్తులో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

MP Avinash Reddy: బెయిలా.. లేక సీబీఐ విచారణ..? ఎంపీ అవినాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో మరోసారి విచారణ
Mp Avinash Reddy
Follow us on

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నాలుగేళ్ల తర్వాత స్పీడ్‌ అందుకుంది. కారణాలు ఏవైనా.. సీబీఐ మాత్రం దర్యాప్తులో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. ఆయన్ను చంచల్‌గూడ జైలుకి తరలించారు. అయితే.. రిమాండ్ రిపోర్ట్‌లో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని సహా నిందితుడిగా సీబీఐ పేర్కొనడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. నేటికి వాయిదా పడటంతో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుగనుంది. మధ్యాహ్నం లోపు అవినాష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అదేసమయంలో అవినాష్‌రెడ్డిని ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అలాగే.. సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. నేటి ఉదయం ఈ పిటిషన్‌పైనా విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది.

ఇక.. హైకోర్టులో అవినాష్‌రెడ్డి, సీబీఐ తరపు లాయర్లు వాడీవేడి వాదనలు వినిపించారు. భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అవినాష్‌రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. కోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగా అరెస్ట్ చేశారని తెలిపారు. దాంతో.. పిటిషన్ విచారణ మాత్రమే జరుగుతుంది కదా.. అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వలేదు కదా అని న్యాయమూర్తి చెప్పారు. అవినాష్‌రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారని సీబీఐ తరపు లాయర్ వాదనలు వినిపించారు. మూడోసారి విచారణకు రమ్మనప్పుడు 5 రోజుల సమయం తీసుకుని హాజరయ్యారని చెప్పారు. ఇప్పుడు నోటీస్ ఇస్తే మళ్లీ పిటిషన్ వేశారని సీబీఐ తరపు లాయర్ తెలిపారు. కానీ.. దర్యాప్తు పూర్తి చేయడానికే నోటీసులు ఇచ్చామని తేల్చి చెప్పారు. ఎవిడెన్స్ తారుమూరు చేయడంలో అవినాష్‌రెడ్డిది కీలక పాత్ర అంటూ సీబీఐ తరపున లాయర్‌ వాదనలు కోర్టు ముందు వినిపించారు.

మొత్తంగా.. తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చిన తర్వాతే విచారణపై క్లారిటీ రానుంది. దాంతో.. హైకోర్టు.. ముందస్తు బెయిల్ ఇస్తుందా?.. లేక విచారణకు వెళ్లాల్సిందేనని తీర్పు ఇస్తుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..