Minister Kodali Nani: బీజేపీ, టీడీపీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన మంత్రి కొడాలి నాని.. ఇంతకీ ఏమన్నారంటే..

|

Nov 09, 2021 | 1:35 PM

Kodali Nani: బీజేపీ, టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన..

Minister Kodali Nani: బీజేపీ, టీడీపీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన మంత్రి కొడాలి నాని.. ఇంతకీ ఏమన్నారంటే..
Minister Nani
Follow us on

Kodali Nani: బీజేపీ, టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరు పార్టీపై నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. ముందుగా కేంద్రం పెంచిన ధరలపై స్పందించాలన్నారు. ఏడాది కాలంలోనే కేంద్రం పెట్రోల్ 40 రూపాయలు పెంచిందన్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిందని, ఆ భయంతోనే ప్రజలను మభ్యపెట్టేందుకు రూ. 5 లు తగ్గించిందన్నారు. కొండంత పెంచి.. గోరంత తగ్గించి తామేదో ఘనకార్యం చేసినట్లు బీజేపీ నేతలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కొడాలి నాని విమర్శలు గుప్పించారు. బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ ఘోర పరాజయ్యాన్ని చవిచూసినా మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.

70 రూపాయల ధర ఉన్న పెట్రోల్‌ను 110కి ఎందుకు పెంచారని మంత్రి నాని ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గినా.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని బీజేపీ నేతలు.. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు మంచి చేయడం చేతకాక.. కులాలు, మతాల పేరిట ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో చంద్రబాబు పైనా తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొడాలి నాని. బాబు జీవితం అంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లే అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పెట్రోల్ పోసి తగులబెట్టారని, అయినప్పటికీ ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే.. పెట్రోల్, డీజిల్ ధరలపై ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలోనే పెట్రోల్, డీజిల్‌పై సర్‌చార్జి విధించారని మంత్రి నాని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చి ఇంధన ధరలపై ధర్నా చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్‌పైనా మంత్రి నాని తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. పవన్‌కు దమ్ముంటే.. స్టీల్‌ ప్లాంట్‌పై ప్రధాని మోదీకి అల్టిమేటం ఇవ్వాలని సవాల్ విసిరారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలితం శూన్యం అని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేది కేంద్రమని, ఈ విషయంలో జగన్‌పై కాకుండా కేంద్రంపై పోరాటం సాగించాలన్నారు.

Also read:

Stock Markets: జోరులో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడి పెట్టేముందు స్టాక్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి!

Telangana-Tiger Fear: తెలంగాణను బెంబేలెత్తిస్తున్న బెబ్బులి.. ములుగు జిల్లాలో పశువుల మందపై పులి అటాక్..

Personal Loan: తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు.. రూ.5 లక్షల రుణంపై ఎంత వడ్డీ.. నెలకు EMI.. పూర్తి వివరాలు