రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతంలో ఇళ్ల పట్టాల కేటాయింపును వ్యతిరేకిస్తూ అమరావతికి భూములిచ్చిన రైతులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వకపోవడంతో.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో పలుమార్లు విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టులో అమరావతి అంశంపై కేసు పెండింగ్ లో ఉన్నందున.. తుది తీర్పుకు లోబడి ఉండేలా పట్టాలు జారీ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అయితే పట్టాల పంపిణీ సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్లిన ప్రభుత్వం… ఇళ్ల నిర్మాణానికి కూడా వేగంగా అడుగులు ముందుకేసింది. జులై 25 వ తేదీన సీఎం జగన్ ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. సుమారు 50 వేల ఇళ్ల నిర్మాణానికి అదే రోజు మంజూరు పత్రాలు అందించారు.
ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఆప్షన్ 3 ప్రకారం ముందుకెళ్లింది. ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ సంస్థలను ఎంపిక చేసిన ప్రభుత్వం…పనులు కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తుంది.షేర్ వాల్ టెక్నాలజీతో త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఆటంకంగా మారాయి. అమరావతిలోని ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇళ్ల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల
హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళతాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ పేదలపక్షాన ఉంటే చంద్రబాబు పెత్తందారీ వ్యవస్థతో ఉన్నారని ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో రైతుల ఇష్టం ప్రకారం నడవడం కుదరదంటున్నారు. బయటి వారిని తీసుకొచ్చి అమరావతిలో ఇల్లు ఇవ్వకూడదా అన్నారు సజ్జల. గతంలో పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని.. ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా బలమైన వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉంటాయనే విషయాన్ని కోర్టుకు వివరించి విజయం సాధిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అమరావతి లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది.