Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కేవలం రూ.50కే.. ఆగస్ట్ 1 నుంచి కొత్త పథకం..
ఏపీ ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త తెలిపింది. రూ.50కే నాణ్యమైన బియ్యం అందించనుంది. ఈ మేరకు ఆగస్ట్ 1 నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రైతు బజార్లు, మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా వీటిని పంపిణీ చేయనుంది. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.52కు అందించనుండగా.. గ్రేడ్-1 పచ్చి బియ్యం కేజీ రూ.50కు పంపిణీ చేయనుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా వీటిని సబ్సిడీపై అందించనుంది. రైతు బజార్లలో ప్రజలు సబ్సిడీపై వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రతీఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది.
500 కౌంటర్ల ద్వారా..
ఇక రైస్ మిల్లర్లు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. ఈ కౌంటర్ల ద్వారా కూడా ప్రజలు సబ్సిడీపై బియ్యంను కొనుగోలు చేయవచ్చు. దాదాపు 500 రైస్ మిల్లర్లు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరలపై నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇక ఈ కౌంటర్లలో సబ్సిడీ ధరలకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు.
వెయ్యికిపైగా మినీ మార్టులు..
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పలుచోట్ల మన మార్ట్ కేంద్రాలను కొత్తగా ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందిస్తోంది. రాష్ట్రంలో త్వరలో వెయ్యికిపైగా మార్ట్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మార్ట్‌ల్లో అన్ని నిత్యావసర సరుకులు తక్కువ ధరకు ప్రజలు కొనుగోలు చేయవచ్చు. సబ్బుల నుంచి ఉప్పు వరకు దాదాపు 70 రకాల సరుకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కేంద్ర నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్‌తో ఏపీ పౌర సరఫరాల శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాలో ఈ మార్టులను పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించగా.. తొలి విడతలో భాగంగా పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ షాపుల ఆధ్వర్యంలోనే ఈ మార్టులు నడుస్తాయి. రాబోయే రోజుల్లో 250 రకాల వస్తువులను ఈ మార్టుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచనున్నారు. వీటివల్ల రేషన్ డీలర్లకు ఉపాధి, అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ మార్టులు ఎక్కడికక్కడ రానున్నాయి.
