ఏలూరు జిల్లా, ఆగస్టు 14: ఇది కల్వర్టు .. నీట మునిగితే పదిహేను గ్రామాలకు రాకపోకలు బంద్. ప్రస్తుతం బురద ఏజెన్సీ వాసులకు నరకప్రాయంగా మారింది. కుక్కునూరు మండలం దాచారం గుండేటి వాగు మీద కల్వర్ట్ నిర్మించారు. అది 15 గ్రామాలను మండల కేంద్రానికి చేరువ చేసే చిన్న వంతెన. కానీ ఇపుడు దాని ఉనికి క్రమ క్రమంగా ప్రశ్నార్థకంగా మారుతోంది. గోదావరి వరద వచ్చినప్పుడల్లా ఈ వంతెన మునిగి దారులు ముసుకుపోతున్నాయి. వరద తీస్తే కాని మళ్లీ పైన ఉన్న గ్రామాల వారు రాకపోకలు సాగించలేరు. కానీ రాను రాను నిర్వహణ లేక ఆ వంతెన పూడి పోతుంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను అనుసంధానం చేసే గుండేటి వాగుపై సుమారు 15 ఏళ్ల క్రితం లో లెవల్ చప్టా నిర్మించారు. వాగు ఉదృతంగా ప్రవహించినా ఇబ్బంది లేకుండా 15 అడుగుల పైన దీన్ని నిర్మించగా ప్రస్తుతం వంతెన కింద బురద, ఒండ్రు భారీగా పేరుకుపోయి వంతెన రూపురేఖలు కోల్పోతుంది.
వాగు అడుగుభాగం నుంచి 15 అడుగులు పైన ఉండాల్సిన వంతెన పై భాగం ఇప్పుడు వాగు ఇసుక మేటలకు పట్టుమని 4 అడుగులు కూడా లేదు. దీంతో చిన్న వర్షం పడినా వాగు వంతెన పై నీరు చేరుతుంది. దీంతో చిన్న వర్షానికి సైతం 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగు చప్టా నిర్వహణ సరిగ్గా లేకపోవడం తో ప్రమాదం పొంచి ఉంది. వాగు ఆ దరి ఈ దరి కలిపి చూస్తే వంతెన ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది.
వంతెన కింద భారీగా బురద, ఒండ్రు పేరుకుపోయి ఉన్నాయి. దీంతో నీరు రెండు వైపులా వెళ్లేందుకు కూడా కష్టంగా మారుతుంది. ఇదే పరిస్థితి ఉంటే వాగు ఇసుకలో వంతెన కలిసి పోయే ప్రమాదం ఉందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. మరోవైపు వరదలు, వాగులు ఉధృతంగా వచ్చినప్పుడు ఆ పరివాహక పంటచేలు భారీగా కోతకు గురవుతున్నాయి. ఇటీవల వచ్చిన వరదలకు భారీగా బురద పేరుకుపోయింది. అసలు అక్కడ వంతెన రూపురేఖలు కూడా కనిపించటం లేదు. పేరుకుపోయిన బురదను సైతం తొలగించటం లేదు. దీనిపై యంత్రాంగం ద్రృష్టి పెడితే కాని ప్రజల అగచాట్లు తప్పేలా లేవు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.