TDP: టీడీపీ అధినేత చంద్రబాబు సహా మరో ఇద్దరు టీడీపీ సీనియర్లకు ఈసీ నోటీసులు
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేతలకు ఈసీ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. సీఎం జగన్‌పై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టడంపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో నోటీసులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార వైసీపీ, కూటమి నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు విసురుకుంటూ.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయి ప్రసంగిస్తున్నారు. దాంతో.. ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. వైసీపీ నేతల కంప్లైంట్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌పై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టడంపై ఈ నెల 2న ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను సైతం అందచేయడంతో వారికి నోటీసులు జారీ చేసింది. పెత్తందారు జగన్, పెన్షన్ నిధులను మళ్ళించారంటూ జగన్‌పై కార్టూన్లు రూపొందించి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారంటూ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు లేళ్ల అప్పిరెడ్డి.
వైసీపీ ఫిర్యాదులపై స్పందించిన ఏపీ ఎన్నికల సంఘం.. టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడుకి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఇక.. అంతకుముందే.. వైసీపీ ఫిర్యాదుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. గత నెల 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ప్రసంగంపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దాంతో.. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోకి వివరణ ఇవ్వాలని గడువు విధించింది. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని హెచ్చరించింది. మొత్తంగా.. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇద్దరు సీనియర్లకు ఈసీ నోటీసులు ఇవ్వగా.. వారిని ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
