Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయే.. కేంద్ర, రాష్ట్రాలపై శైలజానాథ్ ఫైర్..

Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకు నీరు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని ఏపీపీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్‌ తెలిపారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయే.. కేంద్ర, రాష్ట్రాలపై శైలజానాథ్ ఫైర్..
Sailajanath

Edited By: Shiva Prajapati

Updated on: Jul 09, 2021 | 4:24 PM

Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకు నీరు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని ఏపీపీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్‌ తెలిపారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌ రెడ్డి పార్టీ కబుర్లు చెప్పే పార్టీ అని విమర్శించారు. నీటి రాజకీయాలు చేసే వైసీపీ.. రాయలసీమకు నీళ్ళెందుకు ఇవ్వలేకపోతుందో చెప్పాలని శైలజానాథ్ డిమాండ్‌ చేశారు. నీళ్ల విషయంలో వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాను తెచ్చుకోలేని అసమర్ధత సీఎం ఎందుకన్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచింది, హంద్రీనీవా నుంచి కుప్పంకు నీళ్ళు తెచ్చింది.. కాంగ్రెస్‌ పార్టీయేనని తెలిపారు. రాష్ట్రంలో 99 శాతం ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు చంద్రబాబు, ఇటు జగన్‌ ఎవరి ప్రయోజనాల కోసం వారు స్వార్ధపూరితంగా వ్యవహరించారని శైలజానాథ్ ఆరోపించారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడబడాలని, ఏపీ నీళ్ళు ఏపీకి రావాల్పిందేనన్నారు. తమ మధ్య భేషజాలు లేవంటూ షేక్‌ హ్యాండ్‌లు ఇచ్చుకున్న కేసీఆర్‌, వైయస్‌ జగన్‌లు.. ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం లేదో చెప్పాలన్నారు. ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణా, ఆంద్రా ప్రజల్లో టెన్షన్‌ పెరిగితేనే తమకు లాభం అన్నట్టుగా ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమాలను కాంగ్రెస్‌ పార్టీ చేయడాన్ని చూసి వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. ఎక్కడ తాము వైఎస్‌ఆర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను ఎగరేసుకునిపోతామోనని భయపడ్డారన్నారని అన్నారు. అసలు రాజన్న రాజ్యమంటే ఇందిరమ్మ రాజ్యం అని.. ఉచిత కరెంట్‌, పక్కాఇళ్ళను ప్రజలకు అందించింది కాంగ్రెస్‌ పార్టీయే అని అన్నారు. రాజన్న రాజ్యంలో విద్యుత్‌ మీటర్లు ఉండవన్నారు… కాంగ్రెస్‌కు చెందిన వైఎస్‌ఆర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను సెంటిమెంట్‌ సాకుతో వైసీపీ వాడుకుంటోందని ఆరోపించారు.

ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం వైఎస్ జగన్‌ లు కరోనా ముసుగులో ప్రజలను దోపిడీ చేస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు. ‘విశాఖ ఉక్కు’ లాంటి ప్రజల ఆస్తులను ప్రధాని మోదీ.. కార్పోరేట్‌ సంస్థలకు అమ్ముతుంటే, చొక్కాలు చించుకున్న వైసీపీ నేతలు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదన్నారు. ఆస్థులు అమ్ముకుని పరిపాలన చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు రెండు రూపాయలు తక్కువగా లభిస్తోందని తెలిపారు. కరోనా కాలంలో ధరలు తగ్గించాల్సింది పోయి పెంచేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ తన మిత్రుడు అదానికి పోర్టులను ధారాదత్తం చేస్తున్నారన్నారని విమర్శించారు. ఆంధ్రా నుంచి ఎగుమతి అవుతున్న పెట్రో, డీజిల్‌ ఉత్పత్తులను స్థానికంగా తక్కువ ధరలకు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీజిల్‌ లీటర్‌ ధర వంద రూపాయలు దాటించిన ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని విమర్శించారు.

కేంద్రం దగ్గర అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రం దగ్గర తాకట్టు పెడుతున్నారని సీఎం జగన్‌పై శైలజానాథ్ మండిపడ్డారు. ఆస్థిపన్ను పెంచుతూ, చెత్తపన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే తమ స్వంత ప్రయోజనాలు దెబ్బతింటాయని సీఎం జగన్‌కు భయం పట్టుకుందన్నారు. వీటన్నిటిపై రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుందని శైలజానాధ్‌ తెలిపారు. విజయవాడ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17వ తేదిన ఆందోళనలు చేస్తామన్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఒంటిపై చొక్కాలు కూడా వీళ్ళు లాక్కుంటారన్నారు. వెంటనే పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌ ధరలు తగ్గించాలని, 50 శాతం సబ్బిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Also read:

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో న్యూ లుక్.. బాలీవుడ్ మూవీ కోసం ఆర్మీ జవాన్ గా మారిన నాగచైతన్య

TS Weather Report: తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్..!

Onion Pakoda: చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడీ తినాలని ఉందా.. ఈజీగా టేస్టీగా ఇలా తయారు చేసుకోండి