విశాఖ, జనవరి 2: నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున ఔదార్యాన్ని చాటుకున్నారు. గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారు. తన నెల జీతం మెత్తాన్ని నిరుపేదలు, నిస్సహాయుల కోసం కేటాయించారు. అంతే కాదు అందరూ ఈ క్రతువులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో కలెక్టర్ పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరూ నిరుపేదలు, నిరాశ్రయుల సహాయం కొరకు ఏర్పాటు చేసిన సంజీవనీ నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్‌కు సోమవారం స్వచ్ఛందంగా రూ.14,22,368 విరాళాలుగా అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
స్వయంగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున నే తన ఒక నెల జీతం రూ.1,10,000/- అందజేసి తన పెద్ద మనుసును చాటుకోవడంతో మిగతా ఉద్యోగులు కూడా ఉద్యమంలా ముందుకు వచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయ సిబ్బంది రూ.12,000/-, రెవెన్యూ డిపార్టుమెంటులో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉద్యోగులు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగులు రూ.3,85,000, వీఎంఆర్డీఏ ఉద్యోగులు రూ.1,79,523, విద్యాశాఖ రూ.1,05,000/-, ఆరోగ్య శాఖ రూ.95,000/-, పశు సంవర్థక శాఖ రూ.50,000, జిల్లా పరిషత్ రూ.50,000, కో-ఆపరేటివ్ రూ.50,000/-, ఆఫీసర్స్ క్లబ్, విశాఖపట్నం వారు రూ.1,00,000/-, ఇతర వివిధ శాఖల ఉద్యోగులు రూ.2,85,845 చెక్కులను సంజీవని నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కి చెక్కులు, డీడీలు రూపంలో విరాళాలుగా అందజేశారు. ఈ మొత్తాన్ని నిరాశ్రయులకు ప్రత్యేక సందర్భాల్లో వైద్య ఖర్చులు, విద్య, పోషకాహారం తదితర అవసరాల కొరకు ఆర్ధిక సహాయం అందించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
నిరుపేదలు, నిరాశ్రయులను ఆదుకొనేందుకు జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున సంజీవని నిధి పేరుతో గత ఏడాది జనవరి 1వ తేదీ డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ (డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరం తొలిరోజున దీన్ని కలెక్టర్ ప్రారంభించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు వచ్చేవారు స్వీట్లు, పండ్లు, బొకేలు తేవద్దని, శక్తిమేర సంజీవని నిధికి విరాళమివ్వాలని అప్పట్లోనే పిలుపునిచ్చారు. అంతేకాకుండా గత ఏడాది కూడా తన వంతుగా ఒకనెల వేతనం రూ.1.10లక్షలు విరాళంగా ఇచ్చారు. గత ఏడాది కూడా కలెక్టర్ పిలుపునకు ఉద్యోగులు, అధికారులు స్పందించారు. ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా రూ.10,92,998 జమ అయింది. ఈసారి అది 14 లక్షల 22 వేలకు చేరింది.
అసాధారణమైన, ప్రత్యేక సందర్భాల్లో వైద్య ఖర్చులు, దివ్యాంగులు, బుద్ధిమాంద్యం పిల్లలు, అనాథలు, హెచ్ఐవీ, కుష్ఠు బాధితులు, కొవిడ్ ప్రభావిత పిల్లలకు సహాయం, అనాథలకు ప్రాథమిక విద్య, పేద మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక విద్య, మద్దతు ఇవ్వడం, తదితర వాటి కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. బాధితులు దరఖాస్తులను కలెక్టరేట్ ఆవరణలోని ఫిర్యాదుల విభాగంలో అందజేయాలి. వాటిని పరిశీలించి, విచారణ అనంతరం వారికి కలెక్టర్ ఆర్థిక సహాయం చేస్తారు. కలెక్టర్ ఔదార్యానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.