Andhra Pradesh: ఇకపై ఏపీలో 26 జిల్లాలు.. కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్

చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ సిద్ధమైంది. తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు.

Andhra Pradesh: ఇకపై ఏపీలో 26 జిల్లాలు.. కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్
Ys Jagan
Follow us

|

Updated on: Apr 04, 2022 | 11:24 AM

Andhra Pradesh New District: చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ సిద్ధమైంది. సరిగ్గా 9.05నిముషాలకు తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన శాఖల జిల్లా అధికారులు కూడా కొన్ని నిముషాల్లోనే తమ బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలకు కేటాయించిన ఉద్యోగులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 9.45 నిముషాల్లోపు అధికారులంతా విధుల్లోకి చేరిపోయారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. విస్తీర్ణం పాపులేషన్‌ పరంగా పక్కా లెక్కలతో కొత్త జిల్లాల లెక్కతేల్చింది. జిల్లాల విభజన తర్వాత విస్తీర్ణ పరంగా ప్రకాశం 14,322 చదరపు కిలోమీటర్లతో పెద్ద జిల్లా కాగా.. జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 24లక్షల 70వేల జనాభాతో పెద్ద జిల్లాగా నిలుస్తోంది. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత వైయస్సార్ జిల్లాలో 36 మండలాలు ఉన్నాయి. అతి తక్కువ మండలాలున్న జిల్లాగా విశాఖ రికార్డులకెక్కింది. ఈ జిల్లాలో ప్రస్తుతం 11 మండలాలు మాత్రమే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఇక జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ అన్నింటికన్నా చిన్నదిగా పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది.

ఒకే ఒక అర్బన్‌ జిల్లాగా ఏర్పడిన విశాఖలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా మాత్రం 19లక్షల 60వేలు. ప్రతి జిల్లాలో 9 లక్షల నుంచి 24లక్షల 50వేల వరకు జనాభా ఉంది. నాలుగు జిల్లాల్లో 4 చొప్పున రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 12 జిల్లాలు మాత్రం 3 రెవెన్యూ డివిజన్లతో ఏర్పడ్డాయి. మిగిలిన 10 జిల్లాల్లో 2మాత్రమే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 14 జిల్లాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదు జిల్లాల్లో మాత్రం 6అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 20లక్షలకు పైనా జనాభా ఉన్న జిల్లాలు 12 ఉంటే.. రెండు జిల్లాల్లో మాత్రం 19 లక్షల జనాభా ఉంది.

భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. 175లో కేవలం 12 నియోజకవర్గాలు మాత్రమే ఒకే జిల్లాల లేకుండా విడిపోయాయి.

సరికొత్త పాలను కోసం పాత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలు ముస్తాబయ్యాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో 70శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట ప్రైవేట్‌ భవనాలు ఎంపిక చేసింది ప్రభుత్వం.

అనకాపల్లి, భీమవరంలో ప్రభుత్వ భవనాలు ఒక్కటీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కలెక్టరేట్‌ సహా అన్నింటినీ ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాలో ఎస్పీ క్యాంపు కార్యాలయం మినహా మిగిలిన ముఖ్య కార్యాలయాలు సత్యసాయి ట్రస్ట్‌ భవనాల్లో పెడుతున్నారు. రాయచోటి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న అన్నమయ్య జిల్లాలోనూ ఎక్కువగా ప్రైవేటు భవనాలనే ఎంపిక చేశారు.

Read Also…  Nurses Dance: ఆసుపత్రిలో డాన్సులు చేసిన నర్సులు.. లేచి కూర్చున్న కోమాలోని పేషెంట్..!