ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్తుండటంతో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. హస్తినలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలోని తాజా పరిణామాలతోపాటు.. విభజన హామీలను ప్రస్తావించే అవకాశం ఉంది.
వామపక్ష తీవ్రవాదంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. అలాగే.. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలవనున్నారు. వాస్తవానికి.. గత నెల 12న లండన్ యాత్ర ముగించుకుని వచ్చిన వెంటనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగినా.. ప్రధాని అందుబాటులో లేకపోవడంతో పర్యటన వాయిదా పడింది. ఆ తర్వాత.. గత నెల 21 నుంచి 27 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, వరుస సెలవులు వచ్చాయి.
ఈ క్రమంలో.. ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రి అమిత్ షా ఢిల్లీలో అందుబాటులో ఉంటారనే సమాచారంతో హస్తినకు పయనమవుతున్నారు సీఎం జగన్. ఇక.. కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ ఇవాళ హాజరు కావాల్సి ఉన్నా ఢిల్లీ పర్యటనతో వాయిదా పడింది. మొత్తంగా.. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్తుండటంతో జగన్ పర్యటన ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..