AP Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. కాబోయే కొత్త మంత్రులు వీరే..? లిస్ట్ వైరల్..!

|

Apr 05, 2022 | 11:47 AM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దగ్గర పడే కొద్ది ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

AP Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. కాబోయే కొత్త మంత్రులు వీరే..? లిస్ట్ వైరల్..!
Ys Jagan Mohan Reddy
Follow us on

AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దగ్గర పడే కొద్ది ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నెల 7న ప్రస్తుత మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. అందులోనే మంత్రులతో కలిసి జగన్ కొన్నికీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత చివరి కేబినెట్ భేటీ(AP Cabinet Meet) అనంతరం మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పిస్తున్నారో సీఎం జగన్‌ కేబినెట్‌ సమావేశంలో వెల్లడించనున్నారని తెలిస్తోంది.

అదే రోజు ఆయా మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారి రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి 8న గవర్నర్‌ను కలిసి వివరించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అనుమతించాలని కోరతారని సమాచారం. గవర్నర్‌ ఆమోదం తెలపగానే అదేరోజు కొత్తగా మంత్రిమండలిలోకి వచ్చే వారికి సమాచారమిస్తారని అంటున్నారు. 11న ఉదయం 11:31 గంటలకు వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయం పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్న వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు. కాగా, ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులకు సోమవారం సమాచారమిచ్చారు.

కొత్త మంత్రులకు ఒక రోజు ముందుగా మాత్రమే సమాచారం ఇవ్వనున్నారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ డేట్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా ఫిక్స్‌ అయినట్టేనని సమాచారం. సీఎం జగన్‌ తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారని తెలిసిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మంత్రులు అందర్నీ తప్పిస్తారని మొదట్లో భావించారు. కొన్ని సమీకరణల దృష్ట్యా కొందరిని కొనసాగించాలని తర్వాత నిర్ణయించారు. పదవి నుంచి తప్పుకునే కొందరు మంత్రులకు రీజినల్‌ ఇన్‌చార్జి పదవులు ఇవ్వనున్నారు. మిగిలిన వారికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారు.

రాజకీయ, ప్రాంతీయ, సామాజికవర్గ సమీకరణాలను బ్యాలెన్స్‌ చేస్తూ కొత్త మంత్రుల ఎంపికపై జగన్‌ కసరత్తు చేశారని చెబుతున్నారు. మంత్రి పదవుల కోసం ఆశావహులు చాలామందే ఉన్నారు. దాంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు మాత్రమే కొత్త మంత్రులకు సమాచారం ఇవ్వనున్నారు. అప్పటి వరకు సస్పెన్స్‌. మరోవైపు మంత్రి పదవుల నుంచి తప్పించడాన్ని డిమోషన్‌గా భావించవద్దని ఇప్పటికే సీఎం జగన్‌ చెప్పారు. పార్టీ బాధ్యతల ప్రాధాన్యాన్ని వివరించారు. పార్టీని మళ్లీ గెలిపించుకొని వస్తే మళ్లీ మంత్రులు కావచ్చని స్పష్టం చేశారు. మొత్తంగా ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అలాగే, ఈ సారి మంత్రి పదవులకు భారీగా పోటీ నెలకొంది. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో చాలా మంది మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవి పోయినట్టేనా అని మదన పడుతున్నారు. మరి, కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుంది? ఇప్పుడున్నవాళ్లలో ఎంతమందికి కొనసాగింపు ఉంటుంది? పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుంటారా? లేక కొత్త జిల్లాల ప్రకారం చోటు కల్పిస్తారా? ఇప్పుడున్న కుల సమీకరణాలనే పాటిస్తారా? లేకపోతే కొత్త కుల లెక్కల్ని తెరపైకి తెస్తున్నారు. అయితే ప్రస్తుత కేబినెట్‌ నుంచి 4 గురు లేదా ఐదుగురికి చాన్స్‌ ఉండే అవకాశం ఉంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు సమూల మార్పులు జరుగుతున్నాయి. కొత్త జిల్లాలతో కలిపి జిల్లాకో మంత్రి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐదు డిప్యూటీ సీఎంల హోదాలు కొనసాగనున్నాయి.

2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణ ఎవరు ఊహించని విధంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమందికి అవకాశం కల్పించారు. సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కులాల ఆధారంగా మంత్రులకు పదవులను కట్టబెట్టారు. దీనికోసం తనకు అత్యంత సన్నిహితులైన వారిని, సీనియర్లను సైతం అధినేత పక్కన పెట్టారు. తొలి సారి తమను పక్కన పెట్టిన అధినేత రెండో విడత తప్పక అవకాశం ఇస్తారని భారీ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపే లక్ష్యంగా ఈ విస్తరణ చేపడుతున్నట్టు సమాచారం.

జగన్ తొలి కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రి అయిన గుమ్మనూరు జయరాంతో పాటు మధ్యలో కేబినెట్ లో చేరిన మరో బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా తదుపరి కేబినెట్ లో కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని వీరిద్దరిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారంతా రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే పూర్తయిన కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్‌ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అపార రాజకీయ అనుభవం, వాక్చాతుర్యం, వైఎస్సార్‌ లాయలిస్ట్‌ కలిసొస్తాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. ఆయనను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లా నుంచి కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను తప్పించనున్నట్లు సమాచారం. మరో మంత్రి పుష్ప శ్రీవాణి స్థానంలో మరో గిరిజన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నారు. మరో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉంది.

విశాఖ జిల్లా నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. అవంతి స్థానంలో గుడివాడ అమర్‌నాథ్‌ మంత్రి పదవి అశిస్తున్నారు. తూర్పుగోదావరి నుంచి కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్‌, వేణు మంత్రులు ఉన్నారు. కన్నబాబు, పినిపె విశ్వరూప్‌ ను మంత్రి వర్గం నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. దాడిశెట్టి రాజా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే.. విశ్వరూప్‌ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అలాగే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. పశ్చిమగోదావరి నుంచి కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆళ్ల నాని, తానేటి వనిత, రంగనాథరాజు స్థానాల్లో భారీ పోటీనే నెలకొంది. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

అటు, కృష్ణా జిల్లా నుంచి కేబినెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కొడాలి నాని, పేర్ని నాని.. ఇద్దరిని కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. కొత్తగా మాజీ మంత్రి పార్థసారధి రేసులో ముందున్నారు. గుంటూరు జిల్లా నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ ఎవరిని తీసుకుంటురన్న సందిగ్ధత నెలకొంది. నెల్లూరు నుంచి కూడా పోటీ ఎక్కువగానే ఉంది. మంత్రి అనిల్ కుమార్ ను మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు వినికిడి. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డితో పాటు ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబం కూడా మంత్రి పదవిని ఆశిస్తోంది.

చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రులుగా ఉన్నారు. పెద్దిరెడ్డిని కొనసాగించడం ఖాయంగా తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి మరో మంత్రి పదవి కోసం ఆర్కే రోజా పోటీపడుతున్నారు. నారాయణస్వామి ప్లేస్‌లో అదే సామాజికవర్గానికి చెందిన ఆదిమూలం, MS బాబు పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మలూరి జయరాములు మంత్రులుగా ఉన్నారు. బుగ్గన స్థానంలో చక్రపాణిరెడ్డి లేదా కాటసాని రాంభూల్‌ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాములును తిరిగి మంత్రివర్గంలో కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాలో బోయ సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉండటంతో పాటు… అదే సామాజికవర్గానికి చెందిన మరొక ఎమ్మెల్యే లేకపోవడంతో జయరాములుకే అవకాశం దక్కనున్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లా నుంచి ఒక బీసీ, ఒక ఎస్సీకి చోటు దక్కవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి శంకర్‌ నారాయణ మంత్రిగా ఉన్నారు. దీంతో ఇక్కడ జొన్నలగడ్డ పద్మావతికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశముంది. కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుంటే, అంజాద్‌ బాషా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అంజాద్‌ స్థానంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ రేసులో ఉన్నారు.

Read Also…  Covid Variant XE: ఇప్పట్లో మనల్ని కరోనా వదిలేలా లేదు.. కొత్త కొత్త రూపాలతో ప్రాణాలు తోడేస్తోంది!