Thammineni Seetharam: మంత్రి పదవి రాకపోవడంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి రాకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.
Thammineni Seetharam: మంత్రి పదవి రాకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. నాయకుడికి నేను సమస్య కాకూడదని.. ఎక్కడ ఉండమంటే అక్కడుంటానని చెప్పారు. కేబినెట్ కూర్పు అంత సులువేం కాదని.. కేబినెట్ కూర్పు సీఎం విచక్షణాధికారమన్నారు. కేబినెట్‌లో ఉండాలని నన్ను అందరూ అడిగారు.. సీఎం కాదని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డారని తెలిపారు. పార్టీకోసం పనిచేయమంటే చేస్తా.. పాదయాత్రలో నా గెలుపు అవసరం అని సీఎం జగన్ స్వయంగా అన్నారు. మంత్రి పదవి అశించడంలో తప్పులేదుగా అన్నారు తమ్మినేని.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన కేబినెట్ ఇప్పుడు వస్తోంది. దామాషా పద్ధతిలో అణగారిన వర్గాలకు సువర్ణావకాశం ఈ కేబినెట్ ద్వారా సీఎం జగన్ కల్పించారని తమ్మినేని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బిసిలకు పెద్దపీట వేశారు. అలాగే, 133 కార్పొరేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో మాట్లాడిన వాళ్లు చెప్పాలి… బలహీన వర్గాలకు ఇచ్చిన కేబినెట్ ఏపీ చరిత్రలో ఉందా అని ప్రశ్నించారు. జగన్ ఒక పెద్ద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ పక్షపాతి అని మరోసారి రుజువైందన్నారు. సీఎంగా కంటే జగన్ ఒక గొప్ప మానవతావాదిగా మరోసారి నిరూపించుకున్నారు. జగన్‌పై తప్పుగా మాట్లాడిన మాజీమంత్రులు చర్చకు వస్తారా.. అని స్పీకర్ తమ్మినేని సవాల్ విసిరారు.
టీడీపీ నేత అచ్చెం నాయుడు జరిగినవి సింహావలోకనం చేసుకోవాలని ఫైర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చాయో అచ్చెం నాయుడు చూసుకోవాలని చురకలు అంటించారు. యనమల ఎవరు మాకు చెప్పడానికి.. సీఎం జగన్ కి తెలుసు ఏం నిర్ణయించాలో..? కళింగ కమ్యూనిటీ నుంచీ నేను శాసన సభాపతిగా ఉన్నాను.. చాలదా..? మాకు లేని బాధ మీకేమయ్యా..? అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ను రక్షించుకోవాల్సిన కర్తవ్యం అణగారిన వర్గాల మీద ఉంది.. పార్టీకోసం పని చేయమంటే చేస్తాఅన్నారు. సహజంగానే ఆశావహులు ఉంటారు. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమం వచ్చిందని తెలిపారు. ఈ సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనని.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు లేకుండా పోతాయని వెల్లడించారు. నాకు కేబినెట్లో అవకాశం ఇస్తారని నేను ఏనాడూ అనుకోలేదు. బీసీ వర్గానికి చెందినవాడిగా ఇది ఒక గొప్ప కేబినెట్ అంటున్నానని స్పష్టం చేశారు.
Read Also…. Kishan Reddy: ఏపీ, కర్ణాటకకు లేని సమస్య మీకెందుకు..? తెలంగాణ సర్కార్‌కు కిషన్‌రెడ్డి సూటి ప్రశ్న