AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రాజధానుల అంశంపై మరోసారి ఈసమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు విజయవంతం అయ్యేలా తీసుకోవల్సిన చర్యలపై శాసనసమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో అమరావతి శాసనసభ కమిటీ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని కోరారు. గత సమావేశాల్లో, ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సూచించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం వేర్వేరుగా మాట్లాడుతూ.. సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి భాద్యత అధికారులపై ఉందన్నారు. అటు వంటి సత్సాంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి ఇంకా సమాధానాలు అందజేయాల్సి ఉందని, ఆ సమాదానాలను కూడా ఈ సమావేశాల్లో అందజేయాలని సూచించారు.
మాజీ MLCల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మోషేను రాజు అధికారులను కోరారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడే మాజీ ఎం.ఎల్.సి.లకు అందజేసే ఔషధాలను వారు నివశించే ప్రాంతాల్లోనే అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని సూచించారు.
పోలీస్ అధికారులతో శాంతి, భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లను చేయాలని డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డిని శాసనసమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. గౌరవ సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరు అయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటు వంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..