Andhra Pradesh: ఏపీలో వెలుగులోకి వచ్చిన మరో తెలుగు శాసనం.. అందులో ఏముందంటే..

ప్రకాశం జిల్లాలో మరో తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. మిల్లంపల్లె వేణుగోపాలస్వామి ఆలయంలో 15వ శతాబ్దానికి చెందిన తెలుగుశాసనం బయటపడింది. 1440లో మిల్లంపల్లె గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నిత్యాన్నదానం కోసం ఓ గ్రామాన్ని కానుకగా ఇచ్చినట్టు శాసనంలో రాసి ఉంది. శ్రీమన్‌మహా మహామండలేశ్వర..

Andhra Pradesh: ఏపీలో వెలుగులోకి వచ్చిన మరో  తెలుగు శాసనం.. అందులో ఏముందంటే..
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Oct 11, 2024 | 8:45 PM

ప్రకాశం జిల్లాలో మరో తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. మిల్లంపల్లె వేణుగోపాలస్వామి ఆలయంలో 15వ శతాబ్దానికి చెందిన తెలుగుశాసనం బయటపడింది. 1440లో మిల్లంపల్లె గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నిత్యాన్నదానం కోసం ఓ గ్రామాన్ని కానుకగా ఇచ్చినట్టు శాసనంలో రాసి ఉంది. శ్రీమన్‌మహా మహామండలేశ్వర అనివారణ సింహారావు అనే పాలకుడు వరదరాజులుకు కొలుకులసీమలోని కూనెబోయినపల్లెని బహుమతిగా ఇచ్చి స్వామివారి ఆలయంలో నిత్యాన్నదానం చేయాలని సూచించినట్టు శాసనంలో గుర్తించారు.

పురావస్తుశాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. శాలివాహనశకం 1440 వైశాఖ శుద్ద పంచమినాడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన మిల్లంపల్లె గోపినాధదేవరకు (ఇప్పటి వేణుగోపాలస్వామి) నిత్యాన్నదానం నిర్వహించేందుకు శ్రీపోతరాజు సింగరయ్య గారికుమారుడు వరదరాజులుగారి ఏలుబడిలో ఉన్న కొలుకుల సీమలోని కూనబోయినపల్లి అనేగ్రామాన్ని స్వామివారి నైవేద్యాలకు సమర్పించారు. అనివారణ సింహారావు బిరుదుకలిగిన ఈ రాజులు గుత్తి పాలకులుగా కూడా ఉన్నారు. ఇది ఇక్కడ లభించిన మొదటి శాసనంగా రికార్డు చేశారు.

వరుసగా వెలుగులోకి వస్తున్న పురాతన శాసనాలు..

కొద్ది రోజుల క్రితం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ స్తంభంపై ఈ శాసనం చెక్కి ఉన్నట్టు గుర్తించారు. అయ్యంగార్లకు భూములు, సంపదలు ఉన్నా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయాల పునరుద్ధరణ, నిర్వహణ చేసేవారు. అలా 14వ శతాబ్దంలో త్రిపురాంతకేశ్వరాలయం భిక్షవృత్తి అయ్యంగార్ల ఆధీనంలో ఉందన్న వివరాలను ఈ శాసనం తెలియచేస్తోంది. తాజాగా ఈ శాసనాన్ని చారిత్రక పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్‌ గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విలసిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైంది.

ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. త్రయంబకాయ- త్రిపురాంతకాయ.. త్రికాగ్నికాలాయ-కాలాగ్నిరుద్రాయ అంటూ ఈ ఆలయంలో నిత్యం రుద్రం వల్లె వేస్తుంటారు. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడంతో ఈ ఆలయానికి ప్రత్యేక విశిష్టత సమకూరింది. ఈ ఆలయం శ్రీశైల ఆలయం కంటే అతి పురాతనమైందిగా చెబుతారు. 7వ శతాబ్ధంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రంగా చెబుతారు. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగించడంతో శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి