AP Budget 2025: ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..

|

Feb 28, 2025 | 9:53 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తూ 3.22లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామంది. అయితే బడ్జెట్‌పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్‌ అంతగొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి..

AP Budget 2025: ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..
AP Politics
Follow us on

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశ పెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించారు. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని.. అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు.

బడ్జెట్ ప్రసంగంలో నెగటివిటీ ఎందుకని ఏడాది గడచినా ఇంకా గత ప్రభుత్వ ప్రస్తావన ఎందుకని వైసీపీ ప్రశ్నించింది. సూపర్‌ సిక్స్‌ హామీలు నమ్మి ప్రజలు కూటమి పార్టీలకు ఓటేస్తే ఇప్పటి వరకు అందింది అర్థ దీపమేనని.. సంపదసృష్టి అద్భుతంగా చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలకు తగిన కేటాయింపులు ఎందుకు చేయలేదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.

బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సరిపడా నిధులు కేటాయించలేదని, బడ్జెట్‌తో ఏ వర్గానికీ న్యాయం జరగదని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.

బడ్జెట్‌లో సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే ఎన్నికల హామీలకు నిధులు కేటాయింపులు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైసీపీ విమర్శలకు దిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..