Air India:టేకాఫ్ అయిన కాసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలు ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఏం జరిగింది!
Visakhapatnam: విశాఖలో విమానం ఎక్కిన ప్రయాణికులకు పెద్ద ప్రమాదమే తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్‌పోర్టు నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి తిరిగి మళ్లీ అదే ఎయిర్‌పోర్టులో సేఫ్ ల్యాండ్ అయింది. దీంతో ఫ్లైట్ దిగిన కొందరు ప్రయాణికులు మాకు ఈ ప్రయాణం ఒద్దు బాబోయ్ అంటూ వెనుతిరిగారు. ఇంతకు అసలు విశాఖలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

విశాఖలో విమానం ఎక్కిన ప్రయాణికులకు పెద్ద ప్రమాదమే తప్పింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో గందరగోళం నెలకొంది. ఇంజన్లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్ ఏటీసీకి సమాచారం అందించాడు. ఏమైందని తెలుసుకునేలోపే.. మళ్లీ విశాఖలో ఆ ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ అయింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులు గుండెలు పట్టుకున్నారు. ఇక ప్రయాణం వద్దు బాబోయ్ అంటూ కిందకు దిగిపోయారు. కొందరు మరో ఫ్లైట్ ఎక్కితే.. మరికొందరు రిఫండ్ తీసుకొని ఫ్లైట్ వద్దు బాబోయ్ బస్సు బెటర్ అని వెళ్ళిపోయారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖ టు హైదరాబాద్.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్.. IX-2658 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రోజు మాదిరిగానే షెడ్యూల్ ప్రకారం విశాఖ నుంచి ఈ మధ్యాహ్నం 2:38 గంటలకు బయలుదేరింది. పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు అంతా విమానంలో 103 మంది పాసింజర్లుగా ఉన్నారు. సరదాగా అందరూ ఫ్లైట్ ఎక్కారు.. రన్వే నుంచి ఫ్లైట్ బయలుదేరి టేకాఫ్ అయింది. అందరూ ఎవరికీ వారు అప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో ఒకటే ఆందోళన.. బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. విషయాన్ని గుర్తించిన పైలెట్.. వైజాగ్ ఏ టి సి కి సమాచారం అందించాడు. విమానాన్ని వెనక్కి మళ్లించి మళ్లీ సేఫ్ గా వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేశాడు.
అసలు ఏం జరిగింది.
ఫ్లైట్ మళ్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుల్లో గందరగోళం. ఏం జరిగిందని ప్రశ్నించిన సమాధానం సరిగా లభించకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. ఈలోగా ఎయిర్పోర్ట్, ఎయిర్ ఇండియా సాంకేతిక సిబ్బంది విమానాన్ని పరిశీలించేసరికి.. ఫ్లైట్ రెక్కల్లోని ఇంజన్ లో పక్షి దూరినట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. పాసింజర్లకు కూడా విషయం తెలియడంతో.. గుండెలు పట్టుకున్నారు. మరమ్మతులకు ఆలస్యం కావడంతో ప్రయాణికులను మరో ఫ్లైట్లో తరలించేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైంది.
గందరగోళం మొదలవడంతో ఫ్లైట్ నుంచి పాసింజర్ లు కిందకు దిగిపోయారు. పాసింజర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎయిర్ ఇండియా చేసినప్పటికీ కొంతమంది.. మరో ఫ్లైట్లో బయలుదేరేందుకు ఆసక్తి చూపితే.. మరికొంతమంది టికెట్ రీఫండ్ తీసుకొని ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మరికొందరు ఫ్లైట్ ప్రయాణం వద్దు అని బస్సు ఎక్కేందుకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసారు.
ఫ్లైట్లో ప్రయాణికుల్లో సినిమా యాక్టర్ రమణారెడ్డి కూడా ఉన్నారు. ఈ సంఘటనపై ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు. ఆ వీడియోలో ఆయన ఇలా అన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2: 20కి స్టార్ట్ అయ్యాం. మళ్లీ అరగంటలో తిరిగి వైజాగ్ వచ్చేసాం. బతికి బయటపడ్డాం.. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. చుక్కలు కనిపించాయి. ఫ్లైట్ వద్దు ఇక బస్సు ఎక్కుదామని వెళ్తున్నా అని చెప్పుకొచ్చారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




