AP Inter Students: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం.. మెనూ ఇదిగో
ఏపీలో మరో పథకానికి శ్రీకారం చుట్టింది..కూటమి ప్రభుత్వం. ఇంటర్ కాలేజ్‌ల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించింది. విద్యార్థుల భోజన పథకానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచనలతో డొక్కా సీతమ్మ పేరును పెట్టింది ప్రభుత్వం. ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు తెలుసుకుందాం పదండి...
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని..విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనవరి 4న లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్. అనంతరం కళాశాలలో ల్యాబ్‌లను పరిశీలించి..విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తేవడమే తన లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. ఈ లక్ష్యం నెరవేర్చేందుకు విద్యార్థులు కూడా కష్టపడి చదవాలని..వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. ఈ పథకంతో లక్షా 48 వేల 419 మంది ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకంలో భాగంగా 398 కాలేజీలను సమీపంలోని పాఠశాలలకు అనుసంధానం చేశారు. ఆ పాఠశాలల్లో భోజనం తయారుచేసి కాలేజీలకు పంపుతారు. మిగిలిన 77 కాలేజీలను సెంట్రలైజ్డ్ కిచెన్‌లకు అనుసంధానించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలో మిగిలిన కాలానికి రూ.27.39కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో రూ.85.84కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.
కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని..భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని గతంలోనే ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వం. అయితే 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ ఆ పథకాన్ని రద్దుచేసింది. ఏపీలో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమయింది. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించాలని నిర్ణయం తీసుకుంది..ప్రభుత్వం.
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం మెనూ ఇదే…
- సోమవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
- మంగళవారం: అన్నం, కోడిగుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ
- బుధవారం: వెజ్ పులావ్, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
- గురువారం: అన్నం, కోడిగుడ్డు కర్రీ సాంబార్, రాగిజావ
- శుక్రవారం : పులిహోర, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
- శనివారం: అన్నం, వెజ్ కర్రీ రసం, పొంగల్ స్వీట్
180 ఏళ్ల క్రితమే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ..
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డొక్కా సీతమ్మ.. 180 ఏళ్ల క్రితమే ఆకలి అంటూ వచ్చిన వారందరి కడుపు నింపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నిత్యాన్నదానం కొనసాగించి..అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. ఆమె గొప్పతనాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచనలతో ఈ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..