Andhra Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో దుమ్ముదుమారం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతం మధ్యభాగంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగస్టు 13న పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో బలపడే అవకాశం ఉండగా, కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Andhra Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో దుమ్ముదుమారం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Andhra Weather Report

Updated on: Aug 12, 2025 | 9:29 PM

బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 – 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో ఆగస్టు 13, బుధవారం పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో ఇది బలపడే సూచనలు ఉన్నాయని తెలిపారు.

దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు నమోదైయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలకు అలెర్ట్ మేసేజ్‌లు పంపించినట్లు తెలిపారు. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

బుధవారం(13-08-25): పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గురువారం(14-08-25):  కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం జిల్లా మద్దిపాడులో 93మిమీ, కాకినాడ జిల్లా కోటనందూరులో 76మిమీ,సామర్లకోటలో 72.2మిమీ,అల్లూరి జిల్లా కరిముక్కిపుట్టిలో 68మిమీ, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 59.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.