విజయనగరం జిల్లాలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఆరుగురు మహిళలు అర్ధరాత్రి షాపు షాపుకు తిరిగి తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే తెల్లవారుజామున 5:00 వరకు యధేచ్ఛగా స్వైర విహారం చేశారు. కాగితాలు, చెత్త ఏరుకునే మహిళల వలె నటిస్తూ యాచకుల వేషధారణలో భుజాలకు సంచులు తగిలించుకొని వీధుల్లో తిరిగారు. వారి వద్ద ఉన్న సంచుల్లో షాపులు పగులగొట్టేందుకు కావల్సిన పరికరాలను కూడా వెంట తెచ్చుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా యాచకుల వలె గుంపుగా సంచరించారు. అర్థరాత్రి దుకాణాల వద్దకు వెళ్లి తమ వద్ద ఉన్న పరికరాలతో తాళాలు విరగగొట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారమంతా షాపుల వద్ద ఉన్న సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఎప్పటిలాగే ఉదయం షాపులు తీసేందుకు వచ్చిన వ్యాపారులు తమ గేట్లు డ్యామేజ్ అవ్వడం చూసి కంగారు పడ్డారు. వెంటనే సిసి కెమెరాలు పరిశీలించగా లేడీ గ్యాంగ్ గేట్లు పగలగొట్టేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు.
నగరంలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ సంచరిస్తుందన్న వార్తలతో విజయనగరం నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా కేంద్రంలో హల్‌చల్ చేసిన మహిళ గ్యాంగ్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల వారీగా అనుమానిస్తున్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న విజయనగరం జిల్లాలో దొంగతనాలకు పాల్పడటం అనువుగా భావించి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. జరిగిన ఘటనతో వృద్ధులు, శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.నగరంలో ఎక్కడైనా అనుమానంగా ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు. అయితే నగరంలో సంచరించిన ఆరుగురు మహిళలు కూడా తలుపులు పగలగొట్టి ఇళ్లలో చొరబడే లేడీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా దొంగతనాలకు పాల్పడిన క్రమంలో ఎవరైనా అడ్డుకుంటే తమ వద్ద ఉన్న రాడ్లతో ప్రతిఘటించి ప్రతి దాడి చేస్తున్నారు.